రాజకీయాలు వేరు..కుల, మతాలు వేరు
తిరుపతి అర్బన్:రాజకీయాలు వేరు..కుల, మతాలు వేరు రెండింటిని ముడిపెట్టడం సరికాదని రాష్ట్ర రెవెన్యూశాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, ఇన్‌చార్జి జేసీ మౌర్య, ట్రైనీ కలెక్టర్ రఘువంశీతో కలసి మంత్రి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని, తా ను ఎస్సీ ఎమ్మెల్యే కావడంతోనే ఇబ్బందులు పెడుతున్నారని ఆయన వాపోతున్న విషయంపై మంత్రిని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి కులం, మతంతో సంబంధం లేదని చెప్పారు. సత్యవేడు ఎమ్మెల్యే సస్పెన్షన్ ఎత్తివేస్తారా? అన్న ప్రశ్నకు మంత్రి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. అలాగే రాయల్ చెరువుకు గండి పడడంతో పలు గ్రామాల్లో తీవ్రమైన నష్టం చోటుచేసుకుంటే కలెక్టర్, ఎస్పీ మాత్రమే చెరువును పరిశీలించారని, జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎమ్మెల్యేలు ఎవరూ అటు వైపు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. తాను చెరువును పరిశీలించకపోయినా ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకున్నట్లు తెలిపారు. గూడూరును నెల్లూరులో కలుపుతామని చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తుచేశారు. భౌగోళికంగా గూడూరు నెల్లూరుతో ముడిపడి ఉన్నప్పటికీ తిరుపతి అభివృద్దికి గూడూరు కీలకమన్నారు. తిరుపతి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్, శెట్టిపల్లి భూ సమస్యలకు సరైన పరిష్కారం ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, బొజ్జల సుధీర్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్, విజయశ్రీ , కోనేటి ఆదిమూలం, తుడా చైర్మన్ దివాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టరేట్ వద్ద నిరసనలు
గూడూరు జేఏసీ చైర్మన్ దశరథరామిరెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు నిరసన చేపట్టారు. అలాగే దామినేడు రైతులు ్త మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కలవడానికి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అలాగే శెట్టిపల్లి వా సులు తమ భూములను అధికారులు ల్యాండ్ పూలింగ్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు.


