లాడ్జిలో మహిళ అనుమానాస్పద మృతి
సూళ్లూరుపేట : పట్టణంలోని రైల్వేగేట్ సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో సుమారు 40 నుంచి 45 ఏళ్లలోపు ఉన్న గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా.. స్థానికంగా ఉన్న ఓ లాడ్జిలో రూమ్ ఖాళీ చేయలేదని సిబ్బంది పరిశీలించగా మహిళ మృతి చెంది ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ బ్రహ్మనాయుడు వెంటనే సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ మహిళకు సంబంధించిన ఆధారాలు ఏవీ దొరక్కపోవడంతో గుర్తు తెలియని మహిళగా భావించారు. తమిళనాడులోని పొన్నేరికి చెందిన మహిళగా భావిస్తున్నారు. ఆరెంజ్ రంగు మీద పసుపు రంగు గళ్లు కలిగిన చీర ధరించి ఉంది. ఎవరైనా తెలిస్తే 94407 96360, 94407 96361 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు తెలియజేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


