జిల్లాకు రెడ్ అలెర్ట్
దిత్వా తుపానుతో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం
మత్స్యకారులు, లోతట్టు గ్రామాల ప్రజల ఆందోళన
మోంథా తుపానుతో తీరని నష్టం.. అందని నష్టపరిహారం
ఇప్పుడు దిత్వాతో అన్నదాతల్లో ఆందోళన
జిల్లాలో సగటు వర్షపాతం 11 మి.మీ.
నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ రద్దు,
స్కూళ్లకు సెలవు
తిరుపతి అర్బన్: జిల్లావ్యాప్తంగా దిత్వా తుపాన్ ప్రభావంతో ఆదివారం సగటున 11 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. ప్రధానంగా వెంకటగిరిలో 25.2 మిల్లీమీటర్లు, చిట్టమూరులో 25, పెళ్లకూరులో 23.6, తొట్టంబేడులో 22.4, దొరవారిసత్రంలో 20.6, వాకాడులో 20, నాయుడుపేటలో 19.8, కోటలో 18.6, గూడూరులో 18.4, సూళ్లూరుపేటలో 17.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వివరించారు.
నేడు స్కూళ్లకు సెలవు..
జిల్లాలోని పాఠశాలలకు, అంగన్‌వాడీ స్కూళ్లకు సోమవారం సెలవు ప్రకటించారు. అలాగే సోమవారం కలెక్టరేట్ నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్) రద్దు చేశారు. చంద్రబాబు పాలనలో చెరువుల కరకట్టలు, కలుజులు, తూములు, వరద కాలువలు, కాజ్‌వేలు తదితర ఇరిగేషన్ పరిధిలో పటిష్టం చేయడానికి ప్రత్యేక నిధుల కేటాయింపు చేయకపోవడంతో తుపాన్‌తో భారీ వర్షాలు వస్తే ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందోనని ఆందోళన చెందుతున్నారు. సముద్ర తీరప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం అవుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలకు చెందిన వారికి టెన్షన్ తప్పడం లేదు.
అన్నదాతలు, మత్స్యకారుల్లో ఆందోళన
ఇటీవల మోంథా తుపాన్‌తో జిల్లావ్యాప్తంగా వరిపంట పెద్దఎత్తున దెబ్బతింది. అయితే అధికారులు మాత్రం పంటసాగులో 33 శాతం కన్నా ఎక్కువ శాతం దెబ్బతింటేనే పరిహారం వస్తుందని లేదంటే ఇవ్వలేమని చెప్పేశారు. జిల్లాలో 33 శాతం కన్నా ఎక్కువ దెబ్బతిన్న ప్రాంతాలు చాలా స్వల్పంగా చూపడంతో రైతులకు పరిహారం అందలేదు. మరోవైపు ఉచిత పంటల బీమా లేకపోవడంతో రైతులకు పరిహారం అందలేదు. ఈ క్రమంలో తాజా లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు 1.60 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. మరో లక్ష ఎకరాలు సాగు చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా సాగు చేసిన వరి పంట రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో 50 శాతం మేరకు నీట మునకలో ఉంది. మరోవైపు పోలాల్లో గట్లుకు గండ్లు పడ్డాయి. సోమ, మంగళవారాలు పెద్ద వర్షాలు వస్తే మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అలాగే కూరగాయలు సాగు చేసిన రైతులకు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు లోతట్టు గ్రామ ప్రజలు ఆందోళ న చెందుతున్నారు. మత్స్యకారులు రెండు నెలలుగా సముద్రంలోకి వేటకు వెళ్లకుండా ఆదేశాలు ఇస్తున్న నేపథ్యంలో ఉపాధి కోల్పోయామంటూ ఆవేదన చెందుతున్నారు.
కంట్రోల్ రూమ్ నంబర్లు
కలెక్టర్ కార్యాలయం 0877 2236007
తిరుపతి ఆర్డీ్‌ఓ కార్యాలయం 7032157040
శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం 8555003504
గూడూరు ఆర్డీఓ కార్యాలయం
08624 252807, 8500008279
సూళ్లూరుపేట ఆర్డీఓ కార్యాలయం
08623295345
సముద్ర తీరంలో అల్లకల్లోలం
వాకాడు: మండల పరిధిలోని సముద్ర తీర గ్రామాల్లో తెల్లవారుజామున నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. అలాగే సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతంలోని ప్రజలు చలి గాలులు, వర్షానికి గజగజ వణుకుతున్నారు. తీర ప్రాంతం కోతకు గురయ్యే ప్రమాదం ఉన్నట్లు తీర గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల రైతులు వరినాట్లు వేసిన పొలాలు వర్షపు నీటితో మునిగిపోయి రైతు గుండెల్లో దడ పుట్టుకొస్తోంది. కొన్ని గ్రామాల్లో వర్షం, ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం ఏర్పడి తాగునీటికి అల్లాడుతున్నారు. చెరువులు, వాగులు, వంకలు, కాలువలు, బ్యారేజీలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లోనే ప్రజలు బయటకు రావాలని తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్ ఆదేశించారు. సముద్ర తీరానికి ఎవరిని అనుమతించకుండా దుగ్గరాజపట్నం మైరెన్ పోలీసులు తీరంలో నిఘా ఉంచారు.


