కోటి సంతకాలతో బాబు కుట్రను అడ్డుకుందాం
నగరి : ప్రభుత్వ వైద్య కాలేజీలను ప్రైవేటుపరం చేయడం ద్వారా పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఆ కుట్రను సంతకంతో అడ్డుకుందామని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆదివారం మండలంలోని ముడిపల్లి గ్రామంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి వచ్చిన మాజీ మంత్రికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి ఆమె ప్రజల నుంచి సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు ప్రభుత్వ వైద్యను అందించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారన్నారు. ఏడు మెడికల్ కళాశాలల భవన నిర్మాణాలు పూర్తి చేశారన్నారు. అందులో ఐదు కళాశాలల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. వాటికి అనుబంధంగా ఆస్పత్రులు కూడా సేవలందిస్తున్నాయన్నారు. నేడు పేదలకు ఉన్నత చదువులు ఎందుకు అన్నట్లుగా మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ప్రజల కోసం కట్టిన మెడికల్ కాలేజీలను కార్పొరేట్ దందాలకు తాకట్టు పెట్టి బడుగు బలహీనులను డబ్బు కోసం బలిచేయడం ప్రభుత్వ ధర్మమా?’’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ప్రజలు చేస్తున్న సంతకం ప్రభుత్వానికి చివరి హెచ్చరిక అని ఆమె స్పష్టం చేశారు.
వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ నేత
నగరి : మండలంలోని ముడిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత చల్లా కుప్పయ్య ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలోకి విచ్చేసిన ఆయనను మాజీ మంత్రి ఆర్కేరోజా పార్టీ కండువా వేసి సాధరంగా ఆహ్వానించారు. చంద్రబాబు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు వైద్యాన్ని, పేద విద్యార్థుల వైద్యవిద్యను దూరం చేస్తున్నందున సహించలేక పార్టీ మారుతున్నట్లు కుప్పయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భార్గవి, వైస్ ఎంపీపీ కన్నియప్ప, ఎంపీటీసీ సులోచనమ్మ, యేసు, నాయకులు బుజ్జిరెడ్డి, చుక్కబ్బశెట్టి, రవికుమార్, అయ్యప్ప, వెంకటేశ్, రామ్‌రమేష్, రామూర్తి, జగదీష్, శేఖర్, చంద్ర, రవి, ఎల్లప్పరెడ్డి, గోవిందరెడ్డి పాల్గొన్నారు.
కోటి సంతకాలతో బాబు కుట్రను అడ్డుకుందాం


