దిత్వా వేళ అప్రమత్తంగా ఉండండి
తిరుపతి రూరల్ : దిత్వా తుపాను కారణంగా ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 9 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎవరికీ సెలవులు ఇవ్వరాదని, ఇప్పటికే సెలవులో ఉన్న వారు విధులకు హాజరు కావాలని సూచించారు. తుపాను తగ్గేంత వరకు ఉద్యోగులకు సెలవులు రద్దు చేస్తున్నామని చెప్పారు. తుపాను కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే, సరఫరా పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం కురిసే సందర్భంలో విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ లైన్లు తెగిపోవడం, స్తంభాలు కూలి పోవడం వంటి సంఘటనలు జరిగినట్లయితే వెంటనే తమ సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబరు 1912 లేదా 1800 425 155333 నంబరుకు కాల్ చేసి సమాచారం అందించవచ్చని తెలియజేశారు.
నేడు యథావిధిగా డయల్ యువర్ సీఎండీ..
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ యథావిధిగా జరుగుతుందని సీఎండీ శివశంకర్ తెలిపారు. డిసెంబరు 1వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వినియోగదారులు కాల్స్ చేయవచ్చన్నారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు 8977716661కు కాల్ చేసి, తమ విద్యుత్ సమస్యలను చెప్పవచ్చన్నారు.
శివశంకర్ లోతేటి,
సీఎండీ, ఏపీఎస్పీడీసీఎల్


