ప్రాణాలంటే ‘ఇసుక’ంత మాత్రం!
ప్రమాదకరంగా పేరూరు చెరువు పూర్తిగా నిండినా స్వర్ణముఖి నీటిని మళ్లించరా? నదిలో దాచిన ఇసుక నిల్వలు కాపాడేందుకేనా? ముఖ్య నేత ఒత్తిడి మేరకే అధికారులు పట్టించుకోవడం లేదా? మొరవ పారితే ముప్పు తప్పదని స్థానికుల ఆందోళన
స్వార్థ ప్రయోజనాల ముందు ప్రజల ప్రాణాలు ఇసుమంతగా మారుతున్నాయి. అక్రమార్జన ముందు అన్నీ తీసికట్టుగా తయారవుతున్నాయి. ఇందుకు తిరుపతి రూరల్ మండలం పేరూరు చెరువు పరిస్థితే నిదర్శనం. స్వర్ణముఖి తీరంలో తమ్ముళ్లు నిల్వ చేసిన ఇసుకను కాపాడేందుకు సుమారు పది గ్రామాలను ప్రమాదంలో పడేస్తున్నారు. చెరువు నిండినా నది నుంచి నీటి విడుదలను ఆపకుండా ముఖ్య ప్రజాప్రతినిధి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుకాసురులుగా అవతారమెత్తిన పచ్చమూకకు అండగా నిలుస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి, టాస్క్‌ఫోర్స్ : తిరుపతి రూరల్ మండలం పేరూరు చెరువుకు చేరుతున్న వరద నీటిని స్వర్ణముఖి నదిలోకి మళ్లించి దిగువ ప్రాంతాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. అత్యవసర సమయాల్లో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఆ దిశగా అడుగులు వేయడం లేదని మండిపడుతున్నారు. తెలుగు తమ్ముళ్ల ఇసుక అక్రమ రవాణాకు నదిలో నీరు అడ్డు కాకుండా చేసేందుకే ముఖ్య ప్రజాప్రతినిధి ఒత్తిడికి అధికారులు తలొగ్గారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరూరు చెరువు ఏమాత్రం మొరవ పారినా వందల ఇళ్లు నీట మునగడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. పేరూరు చెరువు నుంచి దిగువకు మొరవ పారే కాలువలన్నీ పూడిపోవడంతో వరద నీరు రైతుల పొలాలను ధ్వంసం చేసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. సాగులో వున్న వరి పంట కాస్త నీట మునిగి నష్ట పోతామని పేరూరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కష్టాలను, నష్టాలను అధికారులు పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. పేరూరు చెరువుకు అదనంగా వచ్చి చేరుతున్న వరద ప్రళయం సృష్టించక ముందే అప్రమత్తమై నీటిని దారి మళ్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
వందలాది కుటుంబాలకు నష్టం
పేరూరు చెరువు నుంచి వరద ఉప్పొంగితే పేదల ఇళ్లు, రైతుల పంటలతో పాటు పది గ్రామాలు నీట మునిగే ప్రమాదముంది. ఏళ్లుగా కాలువ గట్లుపై నిర్మించుకున్న ఇళ్లు వరదలో చిక్కుకుని, వందలాది కుటుంబాలు రోడ్డున పడక తప్పని దుస్థితి దాపురిస్తుంది. అయినప్పటికీ అధికారులు వరద మళ్లింపులో చేస్తున్న జాప్యంపై అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతుండడం గమనార్హం.
తమ్ముళ్ల కోసమేనా..?
పేరూరు చెరువకు వచ్చే వరదనీటిని స్వర్ణముఖిలోకి మళ్లిస్తే టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్రమంగా నదిలో దాచిన ఇసుక నిల్వలు కొట్టుకుపోతాయనే అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. నది నుంచి నీటిని ఒక చెరువును నింపడానికి చేసిన ప్రయత్నం బాగానే ఉన్నప్పటికీ, లోతట్టు ప్రాంత ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణను సైతం పరిగణనలోకి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఏది ఏమైనా పేరూరు చెరువు మొరవ పారితే జరిగే నష్టానికి అధికారులు, వారిపై ఒత్తిడి తెచ్చిన వారే బాధ్యులవుతారని హెచ్చరిస్తున్నారు.
ప్రాణాలంటే ‘ఇసుక’ంత మాత్రం!


