తీరంలో అలజడి
వాకాడు : దిత్వా తుపాను జిల్లా వైపు దూసుకొస్తుండడంతో అధికారలు సముద్ర తీరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. శనివారం ఈ మేరకు తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. చైన్నె వద్ద తుపాను తీరం దాటే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా తూపిలిపాళెం, కొండూరుపాళెం, అంజలాపురం, శ్రీనివాసపురం, దుగరాజపట్నం, పంబలి, పులింజేరివారిపాళెం, ఓడపాళెం, వైట్‌కుప్పం, పామంజి, మొనపాళెం, చినతోట, పూడికుప్పం, పూడిరాయిదొరువు, నవాబుపేట గ్రామాల మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. తుపాను ప్రభావంతో డిసెంబర్ 2వ తేదీ వరకు జిల్లాతోపాటు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి నుంచి ఉత్తర సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 70 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనమి వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిందని వెల్లడించారు.
జిల్లాలో నేడు, రేపు భారీ వర్షాలు
తిరుపతి అర్బన్ : దిత్వా తుపాను ప్రభావం కారణంగా ఆది, సోమవారాలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించిందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఆయన టెలీకాన్ఫెరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. ఇబ్బందులను కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 0877–2236007కు తెలియజేయాలని సూచించారు. ఈదురుగాలులు ఉంటాయని, ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని, ఈ మేరకు అవగాహన కల్పించాలని కోరారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని చెప్పారు. బలహీనంగా ఉన్న కరకట్టలు, కలుజులు, తూములపై ఇరిగేషన్ అధికారులు నిఘా ఉంచాలని ఆదేశించారు. అలాగే కలెక్టరేట్‌తోపాటు పలు కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యలు తలెత్తితే తిరుపతి ఆర్‌డీఓ ఆఫీస్– 7032157040, శ్రీకాళహస్తి ఆర్‌డీఓ కార్యాలయం– 8555003504, గూడూరు ఆర్‌డీఓ ఆఫీస్– 08624 252807, 8500008279, సూళ్లూరుపేట ఆర్‌డీఓ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్‌లకు 08623295345 ఫోన్ చేయాలని సూచించారు.
వేటకు వెళ్లొద్దు
చిల్లకూరు : తీర ప్రాంతంలోని మత్స్యకారులు సముంద్రంలోకి వేటకు వెళ్లొద్దని తహసీల్దార్ శ్రీనివాసులు సూచించారు. మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ దిత్వా తుపాను కారణంగా సముంద్రం ఒడి మీద ఉంటుందన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని చెప్పారు.


