త్వరలో ‘నవోదయ’ం
తిరుపతి మంగళం : జిల్లాలో త్వరలోనే జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు కానుందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ నవోదయ పాఠశాలను నెలకొల్పాలని గతంతో రాసిన లేఖను కేంద్రప్రభుత్వం స్పందించిందని వెల్లడించారు. ఈ మేరకు విద్యాలయం ఏర్పాటుకు స్థల పరిశీలన చేపట్టినల్లు లేఖలో పేర్కొందని వివరించారు. గ్రామీణ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతోనే జవహర్ నవోదయ విద్యాలయ సమితికి లేఖ రాశామని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి జిల్లాలో నవోదయా పాఠశాల ఏర్పాటు చేయాలనే నిబంధనను ప్రస్తావించామని చెప్పారు. అందులో భాగంగానే నవోదయా సమితి స్పందించి పాఠశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని వెల్లడించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉచితంగా స్థలం కేటాయించాలని కోరారు. శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యేలోపు తాత్కాలిక భవనం అందించాలని స్పష్టం చేశారు.
పంటల బీమా ప్రీమియం
తిరుపతి అర్బన్: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించేది. అయితే చంద్రబాబు పాలనలో రైతులే ప్రీమియం కట్టుకోవాలనే నిబంధనలు పెట్టారు. ఈ క్రమంలో సీజన్ మొదలైన వెంటనే ఏ పంటకు ఎంత ప్రీమియం కట్టుకోవాలనే సమాచారాన్ని అగ్రికల్చర్ అధికారులు ప్రకటించాల్సి ఉంది. తాజాగా శనివారం జిల్లా వ్యవసాయశాఖ అఽధికారి ప్రసాద్‌రావు ప్రీమియం వివరాలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. రైతు సేవా కేంద్రంలో ఆధార్‌కార్డు, రైతు పాస్ పుస్తకం, కౌలు రైతులు అయితే సీసీఆర్‌సీ పత్రం జిరాక్స్‌లను సమర్పించాల్సి ఉంటుంది. వరికి ఎకరాకు రూ.630, వేరుశనగకు రూ.450 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
‘సీఆర్‌టీ’కి పటిష్ట ఏర్పాట్లు
తిరుపతి అర్బన్ : యూపీఎస్సీ– ఈపీఎఫ్‌ఓలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లు, అకౌంట్స్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులకు నిర్వహిస్తున్న కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (సీఆర్‌టీ)కి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని డీఆర్‌ఓ నరసింహులు తెలిపారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లో పరీక్ష ఏర్పాట్లుపై అధికారులతో సమీక్షించారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ ఆదివారం తిరుపతి నగరంలోని ఆరు కేంద్రాల్లో నిర్వహిస్తున్న పరీక్షకు 2,727 మంది అభ్యర్థులు హజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని చెప్పారు. అభ్యర్థులు గుర్తింపు కార్డును తీసుకురావాలని స్పష్టం చేశారు. ఆయా కేంద్రాల్లో మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. యూపీఎస్సీ డైరెక్టర్ ఎన్‌డీ వర్మ, అడిషనల్ కమిషనర్ అర్జున్‌కుమార్ మీనా పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి
తిరుపతి అర్బన్ : రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుశిక్ష పడేలా చూడాలని సూచించారు. మత్తు వినియోగం అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో 42 బ్లాక్ స్పాట్‌లు గుర్తించామన్నారు. మలుపుల వద్ద ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇన్‌చార్జి జేసీ మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి తదితరులు పాల్గొన్నారు.
సీఎండీ ఆకస్మిక తనిఖీ
తిరుపతి రూరల్ : చిత్తూరు జిల్లా పూతలపుట్టు నియోజకవర్గం తవణంపల్లె మండలం తెల్లగుండ్లపల్లె సబ్‌స్టేషన్‌ను ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి విద్యుత్ సిబ్బంది వ్యవహారశైలిని ఆరా తీశారు. విద్యార్థులతో మమేకమై విద్యుత్ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ వినియోగదారులతో మాట్లాడి వారి గృహ విద్యుత్ బిల్లులను పరిశీలించారు.
త్వరలో ‘నవోదయ’ం
త్వరలో ‘నవోదయ’ం


