సత్వరం.. సమస్యల పరిష్కారం
తిరుపతి అర్బన్ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, సమస్యలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో శనివారం విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ సుబ్బరాయుడు, ఎమ్మెల్సీ కల్యాణ చక్రవర్తి, చిత్తూరు ఎంపీ ప్రసాద్‌రావు, సత్యవేడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు కోనేటి ఆదివాలం, నెలవల విజయశ్రీ, డీఆర్‌ఓ నరసింహులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గత మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలు, వాటికి చూపించిన పరిష్కారాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులకు నిర్దేశిత గడువులోపు పరిష్కారం చూపాలని కోరారు. అలాగే క్రమం తప్పకుండా సివిల్ రైట్స్ డే నిర్వహించాలని చెప్పారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ భద్రతా అంశాలపై పటిష్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో ఎస్సీలకు అన్యాయం జరుగుతున్నట్లు వెల్లడించారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఉంటే మరో వ్యక్తికి పెత్తనం ఇవ్వడంపై అంసతృప్తి వ్యక్తం చేశారు. అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, ఆర్డీఓలు రామ్మోహన్ , భాను ప్రకాష్ రెడ్డి, కిరణ్మయి, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ పాల్గొన్నారు.


