స్వర్ణముఖిలో భారీగా తవ్వకాలు
– భవిష్యత్తులో తాగునీటికి ఇక్కట్లు
చిట్టమూరు : ఇసుకాసురులు బరి తెగించి ఇష్టానుసారంగా తవ్వకాలు చేస్తుండడంతో స్వర్ణముఖి నదిలో భారీ స్థాయిలో ఇసుక నిల్వలను ఉంచి అక్కడ నుంచి ట్రాక్టర్, టిప్పర్లలతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీని వల్ల భవిష్యత్తులో చిట్టమూరు మండలంలోని సుమారు 40 గ్రామాలలో తాగునీటికి భవిష్యత్తులో ఇక్కట్లు తప్పవని మండల ప్రజలు అంటున్నారు. చంద్రబాబు సర్కార్ ఏర్పడిన తరువాత ఇసుకను ఇష్టం వచ్చినట్లు తవ్వి చైన్నెకి తరలించేస్తున్నారు. గూడూరు నియోజకవర్గంలో కోట మండలంలోని గూడలి ప్రాంతంలో మాత్రమే అధికారికంగా ఇసుక రీచ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే గూడలి రీచ్‌ను సాకుగా చూపించి స్వర్ణముఖి నదిలో కోట, చిట్టమూరు మండలాలలో తమ ఇష్టం వచ్చినట్లు బారీ స్థాయిలో తవ్వకాలు చేపట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజులు క్రితం తెలుగు గంగ నీటిని వాకాడు బ్యారేజ్‌కు వదలడంతో స్వర్ణముఖికి భారీగా నీరు వస్తోంది. దీంతో కోట మండలంలో ఇసుక తవ్వకాలు అడ్డంకిగా మారడంతో శుక్రవారం చిట్టమూరు మండలంలోని మెట్టు గ్రామ సమీపంలో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో భారీ స్థాయిలో ఇసుకను తవ్వి గుట్టలుగా పోసి అక్కడ నుంచి తరలించేస్తున్నారు. ఈ తవ్వకాల వల్ల భవిష్యత్తులో మెట్టు గ్రామం నుంచి దరఖాస్తు గ్రామానికి ఏర్పాటు చేసిన రాజీవ్ టెక్నాలజీ మంచి నీటి పథకానికి నీరు అందే పరిస్థితి గగనంగా మారింది. ఇలాగే తవ్వకాలు చేపడితే స్వర్ణముఖికి వేసిన కర కట్టలకు ఆనుకుని ఉన్న సుమారు 40 గ్రామాల మంచి నీటి పథకాలతో పాటుగా సుమారు 1000 మంది రైతుల వ్యవసాయ బోర్లు పరిస్థితి అగమ్య గోచరంగా మారనుంది.
స్వర్ణముఖిలో భారీగా తవ్వకాలు


