వైభవంగా లక్ష కుంకుమార్చన
చంద్రగిరి: తొండవాడ స్వర్ణముఖినది ఒడ్డున వెలసిన శ్రీఆనందవల్లి సమేత అగస్తీశ్వర స్వామి ఆలయం(రుద్ర పాదాల ముక్కోటి)లో శుక్రవారం ఉదయం లక్ష కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాద్యాల మధ్య అమ్మవారికి కుంకుమార్చన జరిపించారు. ఆలయ నిర్వాహకులు, ధర్మకర్త మొగిలి రఘురామిరెడ్డి పర్యవేక్షణలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. కుంకుమార్చనలో పాల్గొన్న వారికి పసుపు, కుంకుమ, గాజులు అందజేశారు. అన్నదానం చేశారు.
లింగ వివక్షను
నిర్మూలించాలి
తిరుపతి అర్బన్ : లింగ వివక్షను నిర్మూలించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే డిసెంబర్ 23 వరకు నాలుగు వారాల పాటు జెండర్ సమానత్వ ప్రచారం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. మొదటి వారం రోజులు పనిచేయడం ద్వారా భారతదేశం అభివృద్ధి అనే అంశం, రెండో వారంలో మహిళకు స్వేచ్ఛ లభిస్తే సమాజం అభివృద్ధి చెందుతుంది అనే అంశం, మూడో వారంలో భద్రమైన మార్గాలు అభివృద్ధికి సోపానాలు అనే అంశం, నాలుగో వారంలో ఇంటి పని అందరం పంచుకుందాం అభివృద్ధి సాధిద్దాం అనే అంశంపై ప్రచారం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, తిరుపతి ఆర్డీవో రామ్మెహన్, ఐసీడీఎస్ పీడీ వసంతబాయి, డీపీవో సుశీలాదేవి పాల్గొన్నారు.
వైభవంగా లక్ష కుంకుమార్చన


