గుడిమల్లానికి సౌకర్యాలు
ఎంపీ కృషి..
ఏర్పేడు : భారతదేశపు తొలి శివాలయం ఏర్పేడు మండలం గుడిమల్లంలో వెలసిన శ్రీ ఆనందవల్లీ సమేత పరశురామేశ్వరాలయ అన్నదాన సత్రానికి తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి చొరవతో అనుమతులు లభించాయి. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ఆలయం పురావస్తుశాఖ అధీనంలో ఉంది. పరశురామేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన సత్రం నిర్మాణానికి నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ శుక్రవారం అనుమతులిస్తూ జీవో జారీ చేసింది. ఆలయ పరిసరాల్లో అవసరమైన సౌకర్యాల విస్తరణ అత్యవసరమని ఎంపీ గురుమూర్తి పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి, పురావస్తు శాఖకు లేఖల ద్వారా వివరించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం కల్యాణకట్ట, పాకశాల, అన్నదాన శాల, యాగశాల, రాధాశాల వంటి నిర్మాణాలకు 2022 నుంచి అప్పటి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, పురావస్తు సర్వే డైరెక్టర్ జనరల్‌కు ఎంపీ గురుమూర్తి వరుసగా లేఖలు రాసి అనుమతులు కోరారు. ఈ నిర్మాణాల్లో కొంత భాగం ఆలయ రక్షిత ప్రాంతంలోకి రావడంతో అనుమతులు ఆలస్యమవుతూ వచ్చాయి. అయితే భక్తులకు అత్యవసరమైన తాత్కాలిక అన్నదాన సత్రం నిర్మాణానికి నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ ‘నో అబ్జెక్షన్’ జారీ చేసింది. గుడిమల్లం ఆలయ అభివృద్ధి, రోడ్ల నిర్మాణం కోసం ఇప్పటికే దేవాదాయ శాఖ రూ.95 లక్షల సీజీఎఫ్ నిధులు కేటాయించిన విషయాన్ని ఎంపీ కేంద్రానికి తెలియజేశారు. ఈ అనుమతి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని, గుడిమల్లం ఆలయ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు.


