నకిలీ బాగోతం
నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతన్నలు నష్టపరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్ టీడీపీ ప్రభుత్వంలో జోరుగా నకిలీలు
సూళ్లూరుపేట మండల పరిధిలోని మన్నేముత్తేరి పంచాయతీ పరిధిలోని జంగాలగుంట, బోడివానిదిబ్బ, గంపలకండ్రిగ గ్రామాల్లో రైతులు నకిలీ విత్తనాలతో దారుణంగా మోసపోయారు. ఈ మూడు గ్రామాల్లో సుమారు వంద మంది దాకా రైతులు సుమారు 250 ఎకరాల్లో వేసిన పంట నాశనమైపోయింది. పంట వేసిన 20 రోజులకే వరి పైరులో వెన్ను రావడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. నకిలీ విత్తనాలతో రైతులు నిలువునా మోసపోతున్నారు.
సూళ్లూరుపేట : సూళ్లూరుపేట పట్టణంలో నకిలీ విత్తనాల బాగోతం బయటకు వచ్చింది. నంద్యాల కేంద్రంగా నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారా? లేదా సూళ్లూరుపేటలోనే తయారు చేస్తున్నారా ? వీటి వల్ల మూడు, నాలుగు గ్రామాల రైతులు భారీగా నష్టపోయారు. సూళ్లూరుపేట పట్టణంలోని పాండురంగస్వామి ఆలయం వీధిలో పూజిత ఆగ్రో సర్వీస్ సెంటర్‌లో జంగాలగుంట, గంపలకండ్రిగ, బోడివారిదిబ్బ గ్రామాలకు చెందిన రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. విత్తనాలు తీసుకెళ్లిన రైతులు నార్లు పోసుకుని ఇటీవల కురిసిన వర్షాలకు వరినాట్లు వేసుకున్నారు. 20 రోజుల తరువాత ఎరువులు వేయడానికి వెళ్లిన రైతులకు వరిపైరు వెన్ను రావడం చూసి ఆందోళన చెందుతున్నారు.
నంద్యాల నుంచి సరఫరా
స్థానిక మండల వ్యవసాయాధికారి కాంచనకు ఫిర్యాదు చేయడంతో ఆమె పొలాన్ని పరిశీలించి ఇలా తాను ఎప్పుడూ చూడలేదని చెప్పారు. రైతులందరితో మాట్లాడి విత్తనాలు కొనుగోలు చేసిన పూజిత ఆగ్రో సర్వీస్ సెంటర్ యజమానిని నిలదీశారు. ఆగ్రో సర్వీస్ సెంటర్ యజమాని మాత్రం నంద్యాల నుంచి విత్తనాలు తెచ్చానని, అంతా బాగున్నాయని తాను కూడా రైతులకు విక్రయించానని తప్పించుకునే ప్రయత్నాలు చేయడం గమనార్హం. తెలుగు దేశం ప్రభుత్వంలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని రైతన్నా మీకోసం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు రైతులను ఈ విధంగా మోసం చేస్తున్నా పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోది. నకిలీ విత్తనాలు తయారు చేసేవారిపై తగిన చర్యలు తీసుకొని నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
నాట్లు వేసిన 20 రోజులకే వరి పైరుకు వెన్ను
నకిలీ బాగోతం


