హత్యోదంతంపై అనుమానాలు
ఏర్పేడు : శ్రీకాళహస్తి మండలంలో సంచలనం రేపిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్‌రెడ్డి తల్లి హత్యోదంతంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని పుల్లారెడ్డి కండ్రిగలోని వారి ఇంట్లోకి బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి, నిద్రిస్తున్న వృద్ధ దంపతులను అంతమొందించేందుకు కత్తితో దాడి చేసి మధుసూదన్‌రెడ్డి తల్లి జయమ్మను హతమార్చారు. ఆమె భర్త మహదేవరెడ్డిని గాయపరిచారు. అయితే ఈ ఘటనలో నిందితులను ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవటంపై మృతురాలి బంధువర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, కాల్ డేటా, వేలిముద్రలు, ఇతర ఆధారాలతో కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను పట్టుకోవాల్సిన పోలీసులు రెండు రోజులు గడిచినా, అనుమానితులను స్టేషన్‌కు పిలిపించి విచారించి పంపుతున్నారే తప్ప కేసులో పురోగతి ఏమిటన్నది తెలియాల్సి ఉంది. డబ్బు, బంగారు ఆభరణాల కోసం దొంగలు ఇంతటి దారుణానికి ఒడిగట్టారా..? రాజకీయ కక్షలతో అంతమొందించారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో నిందితులను అరెస్ట్ చూపకపోవటంతో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
ఘటనపై మాజీ సీఎం ఆరా..
సంచలనం రేపిన వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడి ఇంటిపై దాడి, అతని తల్లి జయమ్మ హత్య ఘటనపై వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆయన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి ఫోన్ చేసి ఘటన గురించి ఆరా తీసినట్లు సమాచారం. దీంతో ఎంపీ గురుమూర్తితోపాటు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఉండి మృతురాలి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు.
భార్య అంతిమ యాత్రలో
విలపించిన భర్త మహదేవరెడ్డి
వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా గడిపిన చెవిరెడ్డి మహదేవరెడ్డి, జయమ్మ దంపతులపై దుండగులు దాడి చేసి తన భార్యను హత మార్చటంతో మహదేవరెడ్డి భార్య మృతదేహం వద్ద బోరున విలపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం డిశ్చార్జి అయ్యారు. సతీమణి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇది అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.


