ఫ్లెమింగో పెస్టివల్‌కు సన్నద్ధం
తిరుపతి అర్బన్ : సూళ్లూరుపేట సమీపంలోని పులికాట్ సరస్సు ప్రాంతంలో ఫ్లెమింగో పెస్టివల్‌ను వేడుకగా నిర్వహించడానికి అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. జిల్లా పర్యాటక మండలి అధ్యక్షతన గత ఏడాది నిర్వహించిన తరహాలోనే ఈ ఏడాది కార్యక్రమాలను చేపట్టాలని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఆయన శుక్రవారం జూపార్క్ క్యూరేటర్ సెల్వం, పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్ రమణప్రసాద్, సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి, జిల్లా అటవీశాఖ అధికారి సాయిబాబా, సూళ్లూరుపేట డివిజన్ అటవీశాఖ అధికారి హారికతో కలసి సమీక్షించారు. ఇప్పటి నుంచి ఏర్పాట్లు ప్రారంభించాలని సూచించారు. ఫ్లెమింగో ఫెస్టివల్‌కు సంబంధించిన మైక్రో ప్లాన్ సిద్ధం చేయడం, తేదీలు ఖరారు చేయడం, పలు కార్యక్రమాలు, పర్యాటక సదుపాయాలు, వేదికల ప్రణాళిక, పులికాట్ – నేలపట్టు ప్రాంతాల్లో ఏర్పాట్లుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వివరించారు. సమావేశానికి జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, సంబంధిత మండలాల తహసీల్దార్లు, మున్సిపాలిటి అధికారులు, రెవెన్యూ, వ్యవసాయ, ఫిషరీస్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
అక్రిడిటేషన్ కార్డుల
గడువు పొడిగింపు
తిరుపతి అర్బన్ : జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈనెల 30తో ముగుస్తున్న నేపథ్యంలో మరో రెండు నెలలు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగింపు చేయడానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయని స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ కార్డులు కలిగిన పాత్రికేయులు డిసెంబర్ 1 నుంచి పొడిగింపు చేసకునే సౌకర్యం ఉందని వెల్లడించారు. ఆ మేరకు మీడియా యాజమాన్యం వారి నుంచి సంస్థలో పనిచేయుచున్న జర్నలిస్టుల వివరాలను జిల్లా సమాచార పౌరసంబంధాలశాఖ అధికారికి అప్పగించాలని వివరించారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 59,548 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,548 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.54 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


