పోలింగ్ కేంద్రాల మార్పుపై అభ్యంతరం
చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీల ఓటుహక్కు వినియోగానికి భంగం కలిగించేందుకు చేసిన పోలింగ్ కేంద్రాల మార్పు, చేర్పులను వెంటనే నిలుపుదల చేయాలని వైఎస్సార్‌సీపీ తరపున చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన నెల వారీ ఎన్నికల సమావేశానికి ఆయన హాజరై పోలింగ్ కేంద్రాల మార్పులపై అభ్యంతరం తెలుపుతూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ రామ్మోహన్‌కు వినతి అందించారు. అలాగే పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులకు స్థానికంగా ఉన్న గ్రామ ప్రజలు అభ్యంతరాలు తెలిపే బలమైన కారణాలను కూడా రాత పూర్వకంగా ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల మార్పు నిస్పక్ష పాతంగా జరగలేదని, ఓటర్లకు ఇబ్బంది కలిగించేలా ఆ నిర్ణయాలు ఉన్నాయని ఆరోపించారు. ఇప్పుడు జరిగే పోలింగ్ కేంద్రాల మార్పు, చేర్పుల వల్ల ఎస్సీ, ఎస్టీలు ధైర్యంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి కనిపించడం లేదన్నారు. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఇచ్చిన వినతులను స్వీకరించిన ఆర్డీఓ రామ్మోహన్ పోలింగ్ కేంద్రాల మార్పు, చేర్పుల విషయంలో పునఃపరిశీలన చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఒకేసారి 44 పోలింగ్ కేంద్రాలను
ఎందుకు కదిలిస్తున్నారు..
చంద్రగిరి నియోజక వర్గంలో ఒకేసారి 44 పోలింగ్ కేంద్రాలను ఉద్దేశపూర్వకంగా కదిలించడం అన్యాయమని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మీడియా ముందు స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల మార్పులు విషయంలో ఎంత వరకై నా పోరాడుతామన్నారు. తమ అభ్యంతరాలపై ఎన్నికల అధికారి నిస్పక్షపాతంగా నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం ఉందన్నారు. 2019 ఎన్నికల్లో ఎన్‌ఆర్ కమ్మపల్లి వద్ద ఎస్సీ, ఎస్టీల ఓట్లు వేయనీయకుండా అడ్డుకోవడంతో పెద్ద ఘర్షణ జరిగిందని ఆ పరిస్థితులను మళ్లీ తీసుకొచ్చేలా పోలింగ్ కేంద్రాల మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. 30, 40 ఏళ్ల నుంచి ఉన్న పోలింగ్ కేంద్రాలను డిస్టర్బ్ చేయడం వల్ల ఓటర్లు చాలా ఇబ్బందులు పడతారన్నారు. పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులపై చేసిన తమ అభ్యర్థనలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకోని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డితో పాటు తిరుపతి రూరల్ ఎంపీపీ మూలం చంద్రమోహన్ రెడ్డి, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు.


