105 వాహనాలకు జరిమానా
తిరుమల : నిబంధనలకు వ్యతిరేకంగా తిప్పుతున్న 105 వాహనాలకు జరిమానా విధించినట్లు తిరుమల ట్రాఫిక్ సీఐ హరిప్రసాద్ తెలిపారు. తిరుమల ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సరైన రికార్డులు లేని 105 వాహనాలను గుర్తించారు. వారి వద్ద నుంచి మొత్తం రూ.3.17 లక్షల జరిమానాలను విధించారు. తిరుమలకు వచ్చే వాహనాలన్నీ కూడా సరైన రికార్డ్స్ తో రావాలన్నారు. కాలం చెల్లిన వాహనాలను తిరుమలకు అనుమతించమని తెలిపారు. ఈ తనిఖీలు తిరుమలలో నిరంతరం జరుగుతాయని పేర్కొన్నారు.
వేలం వాయిదా
భాకరాపేట : తిరుపతి దేవాదాయ శాఖ ఇన్‌స్పెపక్టర్ పి.ఫణిరాజశయన పర్యవేక్షణలో బుధవారం తలకోన సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించాల్సిన బహిరంగ వేలం డిపాజిట్‌దారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా పడింది. సంబంధిత నిబంధనలు, విధివిధానాల ప్రకారం తదుపరి తేదీ నిర్ణయించి మళ్లీ నిర్వహించనున్నట్లు దేవస్థానం తెలిపింది.
హుండీ లెక్కింపు
దేవస్థానంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో 68 రోజులకు గాను రూ.4,15,363 ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు. అన్నదాన హుండీ ద్వారా రూ.45,872 లభించినట్లు తెలిపారు. ఈ వివరాలను దేవస్థానం చైర్మన్ జె. సోమనాథ రెడ్డి, పాలకమండలి సభ్యులు వెల్లడించారు.
అరుణమ్మ కాలనీలో చోరీ
తిరుపతి రూరల్(చంద్రగిరి): ఇంట్లో ఎవరూ లేని సమయంలో బంగారు, వెండి ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లిన ఘటన తిరు పతి రూరల్ మండలం, పుదిపట్ల పంచాయతీ, అరుణమ్మ కాలనీలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. అరుణమ్మ కాలనీకి చెందిన రాణెమ్మ, రెడ్డప్ప ఆచారి దంపతులు గత ఆదివారం చైన్నెలో ఉంటున్న తన చిన్న కుమారుడు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉన్న రాణెమ్మ చెల్లెలు కుమారుడు హర్షవర్ధన్‌కు ఇంటి తాళాలను అందజేశారు. ఈ క్రమంలో బుధవారం ఇంటి వద్దకు వెళ్లిన హర్షవ ర్ధన్ ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించాడు. వెంటనే రేణిగుంటలో నివాసం ఉంటున్న రాణెమ్మ పెద్ద కుమారుడి మురళికి సమాచారం అందించారు. అనంతరం మురళీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ చిన్న గోవిందు, ఎస్‌ఐ షేక్ షావలి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో ఉంచిన 24 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి ఆభరణాలను అపహరించుకెళ్లినట్లు మురళీ ఫిర్యాదు చేశాడు.
105 వాహనాలకు జరిమానా


