శరవణ కంటి ఆస్పత్రి సీజ్!
పుత్తూరు: స్థానిక ఎంబీ రోడ్డులోని చైన్నె శరవణ కంటి ఆస్పత్రిని బుధవారం గోవిందపాళెం అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి కేఆర్ రమేష్, సీహెచ్‌ఓ శివయ్యలు సీజ్ చేశారు. డాక్టర్ రమేష్ మాట్లాడుతూ జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ప్రభుత్వ గుర్తింపు లేని కారణంగా చైన్నె శరవణ కంటి ఆస్పత్రిని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కంటి ఆస్పత్రిపై సమాచార హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి కె.మురగారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి, ప్రభుత్వ ఆనుమతులు లేని నేపథ్యంలో ఆస్పత్రిని సీజ్ చేయాల్సిందిగా జిల్లా వైద్యాధికారి ఆదేశించినట్లు వెల్లడించారు. హెల్త్ సెంటర్ హెల్త్ అసిస్టెంట్ శోభన్‌బాబు, వీఆర్వో బాబు, పోలీసుల సమక్షంలో సీజ్ చేసినట్లు వెల్లడించారు.
అంతర్జాతీయ సదస్సులో ప్రతిభ
చంద్రగిరి : నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ అనిమల్ న్యూట్రిషన్ అండ్ సైకాలజీ అంశంగా ఈనెల 24వ బెంగళూరులో నిర్వహించిన అంతర్జాతీ య సదస్సులో తిరుపతి ఎస్వీ వెటర్నరీ విద్యార్థి నస్వర్ ఖాన్ పరిశోధన ఆలోచన పత్రానికి ప్రశంసలు దక్కాయి. ఆవులు, గేదెల నుంచి వెలువడే మీథేన్ వాయువును తగ్గించేందుకు సహజ ఆహార పదార్థాలతో పాటు ఏఐ సాంకేతిక జోడించి అంశంపై పత్రాలను సమర్పించాడు. ఆయన సమర్పించిన పత్రాలకు గాను సదస్సులో బహుమతి, ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఎస్వీ వెటర్నరీ డీన్ డాక్టర్ సురేష్ కుమార్, అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు.
ద్విచక్ర వాహనాలు ఢీ
తొట్టంబేడు : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదం మంగళవారం రాత్రి తొట్టంబేడు మండలం విరూపాక్షపురం ఎస్టీ కాలనీ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో శ్రీకాళహస్తి మండలం కమ్మకొత్తూరుకు చెందిన నరేంద్ర తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శరవణ కంటి ఆస్పత్రి సీజ్!
శరవణ కంటి ఆస్పత్రి సీజ్!


