జంతు మార్కెట్ యాప్ ప్రారంభం
తిరుపతి సిటీ : ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థి పూర్ణ ప్రసాద్ రూపొందించిన జంతు మార్కెట్ యాప్‌ను వీసీ టాటా నర్సింగరావు ప్రారంభించారు. బుధవారం వీసీ ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రెక్టార్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రైతులు, పశువుల యజమానులు, వ్యాపారులు, గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే విధంగా వర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థి రూపొందించడం అభినందనీయమని కొనియాడారు. విద్యార్థికి మార్గదర్శకత్వం వహించిన ఆచార్య వివేకానంద రెడ్డిని, ప్రిన్సిపల్ ఆచార్య శ్రీనివాసులు, వైస్ ప్రిన్సిపల్ ఆచార్య సుబ్బారావును ఉపకులపతి అభినందించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పీసీ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.


