భద్రతా వలయంలో తిరునగరం
తిరుపతి రూరల్ : ఢిల్లీలో బాంబు దాడుల నేపధ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశ, విదేశాల నుంచి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. బుధవారం ఈ మేరకు తిరుపతి శివారులో ప్రత్యేకంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే నగరంలోకి అనుమతిస్తున్నారు.
రంగంలోకి స్పెషల్ పార్టీ..
జాతీయ రహదారితోపాటు అలిపిరి మీదుగా తిరుమల వెళ్లే మార్గాల్లో చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు నేతృత్వంలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు చెర్లోపల్లె, పచ్చికాపల్లం, వేదాంతపురం అగ్రహారంతోపాటు రేణిగుంట మీదుగా జాతీయ రహదారిపై నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఇందుకోసం స్పెషల్ పార్టీ పోలీసులను రంగంలోకి దించారు. వాహనాల తనిఖీకి ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్లలో..
తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్‌తోపాటు రైల్వే స్టేషన్లలో కట్టుదిట్టంగా నిఘా పెట్టారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు ఎక్కడ కనిపించినా వెంటనే కంట్రోల్ రూమ్ 100, 112లకు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. తిరుమల తర్వాత అత్యధికంగా భక్తులు తరలివచ్చే పద్మావతీ అమ్మవారి ఆలయం వద్ద పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.


