రెండో రోజూ కొనసాగిన ఏసీబీ సోదాలు
రేణిగుంట: మండలకేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండో రోజూ అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన తనిఖీలు అర్ధరాత్రి దాటి రెండు గంటల వరకు కొనసాగించారు. మళ్లీ గురువారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకు కూడా చేస్తున్నారు. ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఆనంద రెడ్డి, ఆయన వ్యక్తిగత సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, సబ్ రిజిస్ట్రార్‌కు సహకరించిన డాక్యుమెంట్ రైటర్లను కార్యాలయంలోనే ఉంచి విచారణ చేస్తున్నారు. నిషేధిత భూములు, కోర్టు కేసుల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ప్రతి డాక్యుమెంటును ఏసీబీ అధికారులు ప్రింట్ తీసుకుంటున్నట్లు సమాచారం. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు, దళారులు రెండు రోజులుగా షాపులు మూసేసి పత్తా లేకుండా వెళ్లిపోయారు. కార్యాలయంలో జరుగుతున్న తనిఖీలలో తమ బండారం ఎక్కడ బయట పడుతుందేమో అని చాలామంది డాక్యుమెంట్ రైటర్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు.
ఆనందరెడ్డిని కాపాడేందుకు భారీ ప్రయత్నాలు
రెండు రోజులుగా కొనసాగుతున్న ఏసీబీ తనిఖీల్లో ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఆనంద రెడ్డి సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే ఆయనను కాపాడుకునేందుకు భారీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఏసీబీ అధికారులను సైతం ప్రలోభ పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారులు ప్రలోభాలకు లొంగకుండా విచారణ చేస్తే భారీ స్థాయిలో అవినీతి, అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణం బయటపడే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రెండో రోజూ కొనసాగిన ఏసీబీ సోదాలు
రెండో రోజూ కొనసాగిన ఏసీబీ సోదాలు


