మానవత్వం మంటగలిసిన వేళ
శ్రీకాళహస్తి: మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. 39 ఏళ్ల పాటు వేలమందికి విద్యాబోధన చేసిన ఓ ప్రధానోపాధ్యాయురాలి చివరి మజిలీ కన్నీళ్లు తెప్పిస్తోంది. రమాదేవి(77) అనే ఓ రిటైర్డు హెచ్‌ఎం.. తాను చనిపోతే కష్టపడి కట్టుకున్న సొంత ఇంట్లో నుంచి సాగనంపాలని కొడుకును కోరింది. అనారోగ్య సమస్యల కారణంగా ఆమె గురువారం మృతి చెందింది. అయితే ఆమె మృతదేహాన్ని తీసుకురావద్దంటూ కోడలు నిర్దాక్షిణ్యంగా తలుపులు మూసివేయడంతో మృతదేహాన్ని రోడ్డు మీదే ఉంచి ఆ కొడుకు పెట్టిన ఆర్తనాదాలు కన్నీళ్లు తెప్పించిన ఘటన శ్రీకాళహస్తిలో వెలుగుచూసింది. వివరాలు.. అత్యంత రద్దీగా ఉండే పెళ్లి మండపం నుంచి వైఎస్సార్ విగ్రహానికి వెళ్లే మధ్య మార్గంలో రిలయన్స్ మార్ట్ ఎదురుగా రోడ్డు మీదే మృతదేహాన్ని పెట్టి కొడుకు, మనవరాలు ఆర్తనాదాలు పెట్టారు. అయితే రిటైర్డు హెచ్‌ఎం రమాదేవి కొడుకు సురేష్‌కు భార్యతో వివాదాలు ఉన్నాయి. అప్పటి నుంచి సురేష్ తన తల్లితో కలిసి పుత్తూరులో నివాసం ఉంటూ కూతురును చదివించుకుంటున్నారు. అయితే రమాదేవి గురువారం మృతి చెందడంతో సొంతింట్లో ఉంచి తన అంతిమయాత్ర నిర్వహించాలన్న చివరి కోరిక తీర్చడానికి సురేష్ తన సొంతింటికి తీసుకొచ్చాడు. కానీ కోడలు ఆమె మృతదేహాన్ని లోపలకు తేకుండా తలుపులు వేసుకుని లోపల కూర్చుంది. దీంతో సురేష్‌కు ఏంచేయాలో దిక్కుతోచక తన కూతురు రేష్మతో కలిసి రోడ్డు మీదే రోధించారు. తన తల్లి కట్టుకున్న ఇంట్లోకి ఆమె శవాన్ని తీసుకెళ్లనీయకుండా తన భార్య ఇబ్బంది పెడుతోందని రోడ్డుపైనే కూతురితో కలిసి రోధించాడు. అధికారులు వెంటనే స్పందించి రమాదేవి మృతదేహాన్ని ఆమె సొంతింట్లో పెట్టారు. అంతిమ యాత్ర పూర్తి చేయాలని సురేష్‌కు సూచించారు.
మానవత్వం మంటగలిసిన వేళ


