సముద్రం..అల్లకల్లోలం
వాకాడు: మోంథా తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. వాకాడు మండలం తూపిలిపాళెం వద్ద ఆదివారం సముద్రపు కెరటాలు ఎవ్వెత్తున 5 మీటర్ల వరకు ఎగసి పడుతున్నాయి. అలాగే దాదాపు 15 మీటర్లు వరకు సముద్రం ముందుకు రావడంతో తీరం కోతకు గురైంది. వాతావరణ మార్పులతో తీర ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికారుల ఆదేశాలతో మత్స్యకార కాపులు సముద్రంపై వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కు పిలిపించారు. మరో నాలుగు రోజులపాటు ఎవరూ వేటకు వెళ్లకూడదని మత్స్యశాఖ జిల్లా అధికారులు ఆదేశించారు. మండలంలోని 14 గ్రామాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు తమ బోట్లు, వేట సామగ్రిని ఒడ్డుకు చేర్చి లంగరు వేశారు. ఈ క్రమంలోనే తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, ఎంపీడీఓ సాయిప్రసాద్, మైరెన్ అధికారులు తమ సిబ్బందితో ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పర్యాటకులు సముద్రం వద్దకు రాకుండా నిఘా ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
సముద్రం..అల్లకల్లోలం


