‘ప్రైవేటీకరణ వద్దు’ పుస్తకావిష్కరణ
తిరుపతి సిటీ : మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతిలోని యూటీఎఫ్ కార్యాలయంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ రచించిన పీపీపీ పేరుతో మెడికల్ కళాశాల ప్రవేటీకరణ వద్దు అనే పుస్తకం ఆవిష్కరించారు. వక్తలు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణతో అనుబంధ ఆస్పత్రులు సైతం ప్రైవేటు వ్యక్తుల చేతులలోకి వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు వైద్య సేవలు పూర్తిగా దూరమవుతాయని మండిపడ్డారు. ఎంబీబీఎస్ చేయాలనుకున్న గ్రామీణ విద్యార్థులు తీవ్రస్థాయిలో నష్టపోతారని ఆరోపించారు. జేవీవీ నేత బిర్లా నాయుడు, యూటీఎఫ్ నేతలు ముత్యాల రెడ్డి, మధు, రామచంద్రా రెడ్డి, నాగరాజా పాల్గొన్నారు.


