
నేడు విద్యాసంస్థలకు సెలవు
తిరుపతి సిటీ : భారీ వర్షాల కారణంగా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ బుధవారం తెలిపారు.
అంగన్‌వాడీ భవనాలపై ప్రత్యేక దృష్టి
తిరుపతి అర్బన్ : భారీ వర్షాల నేపథ్యంలో అంగన్‌వాడీ భవనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐసీడీఎస్ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఐసీడీఎస్ పీడీ వసంతబాయితో కలిసి సీడీపీఓలతో సమీక్షించారు. జేడీ మాట్లాడుతూ పాఠశాల భవనాలు శిథిలావస్థలో ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు మాత్రం క్రమం తప్పకుండా పౌష్టికాహారం పంపిణీ చేయాలని కోరారు. ప్రధానంగా పిల్లలకు అందిస్తున్న కోడిగుడ్ల పరిమాణం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ మేరకు కాంట్రాక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. పీడీ, సీడీపీఓలు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ఎప్పటికప్పుడు సరిచేయాలని సూచించారు.
అంతర్జాతీయ స్థాయి
సిలబస్ అవసరం
తిరుపతి సిటీ : ఎస్వీయూలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించేందుకు అంతర్జాతీయ సిలబస్ అవసరమని వీసీ నర్సింగరావు తెలిపారు. బుధవారం ఈ మేరకు ఇంజినీరింగ్ కళాశాల అధికారులతో సమావేశం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ నూతన పాఠ్యాంశాల రూపకల్పన, తరగతుల నిర్వహణ, టైమ్ టేబుల్, ప్లేస్‌మెంట్ తదితర అంశాలపై కళాశాల అధికారులు, అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్లౌడ్ టెక్నాలజీ, హైడ్రోజన్ మొబిలిటీ, సెమీ కండక్టర్ డిజైన్, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలపై కోర్సులను ప్రవేశపెట్టాలని కోరారు.
మామండూరు
పర్యాటక కేంద్రం మూత
రేణిగుంట: వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా రేణిగుంట మండలంలోని మామండూరు పెద్ద ఏరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫారెస్ట్ అధికారులు బుధవారం మామండూరు వద్దనున్న పర్యాటక కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వర్షాలు తగ్గిన తర్వాత తిరిగి పర్యాటకును అనుమతిస్తామని మామండూరు వన సంరక్షణ సమితి చైర్మన్ కుమార్ తెలిపారు.
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 26 కంపార్ట్‌మెంట్లు నిండాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,343 మంది తిరుమలేశుని దర్శించుకున్నారు. 18,768 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.34 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారికి క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

నేడు విద్యాసంస్థలకు సెలవు

నేడు విద్యాసంస్థలకు సెలవు