
ఐజర్‌లో ఘనంగా స్వచ్ఛోత్సవ్
ఏర్పేడు: ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలో ఉన్న తిరుపతి ఐజర్‌లో బుధవారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛోత్సవ్’ ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ రమేష్చంద్ర మాట్లాడుతూ భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొనే స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణ సవాళ్లకు ఐజర్ విద్యార్థులు, శాస్త్రవేత్తలు వినూత్న పరిష్కారాలు కనుక్కోవాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న ప్రజా అలవాట్లతో దేశం ఎదుర్కొనే పారిశుధ్య, పర్యావరణ సమస్యల పరిష్కారమే మానవాళి మనుగడకు కీలకమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని 2014లో ప్రారంభించిన నాటినుంచి గ్రామాలు, పట్టణాల్లో స్వచ్ఛత పట్ల సమాజంలో అవగాహన పెరిగిందన్నారు. దేశాన్ని 2047 కల్లా వికసిత భారతదేశంగా ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి ప్రతి పౌరుడు పరిశుభ్రతా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించి, ‘పరిశుభ్రతే సేవ’ అనే సందేశాన్ని ఇవ్వడమే స్వచ్ఛతా హి సేవ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఐజర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హుస్సేన్ భుక్య మాట్లాడుతూ కళాశాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్లాస్టిక్ రహిత కళాశాలగా మార్చడంలో ముందడుగు వేస్తున్నామని తెలిపారు. డిప్యూటీ రిజిస్ట్రార్ కుమార్ హిమాన్షు శేఖర్ మాట్లాడుతూ కాలుష్యాన్ని తగ్గించేందుకు కళాశాల ఆవరణలో మొక్కలు పెంచుతున్నామని అందులో భాగంగా అమ్మ పేరిట ఒక్క మొక్క అనే కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి వాటి ప్రాముఖ్యతను తెలిపారు. అందరూ స్వచ్ఛతకు కట్టుబడి ఉంటామని స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులకు స్వచ్చత పై వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రశంసా పత్రాలను అందజేశారు.