
వినియోగదారులకు మెరుగైన సేవలందించండి
తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, సత్వర సేవలను అందించి వినియోగదారుల మన్ననలు పొందేందుకు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివ శంకర్ లోతేటి ఆదేశించారు. బుధవారం ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి 9 సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ పరిధిలోని 410 సెక్షన్లలో విద్యుత్ సిబ్బంది వినియోగదారులకు అందుబాటులో ఉంటూ నిరంతర విద్యుత్ సరఫరా, లో ఓల్టేజ్ సమస్య లేకుండా చేయడానికి అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. విద్యుత్ సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంస్థ పరిధిలో పునర్వ్యవస్థీకరణ విద్యుత్ పంపిణీ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్) కింద 11 కేవీ ఫీడర్లు, ఓవర్ లోడెడ్ 33 కేవీ ఫీడర్లను గుర్తించి వేరు చేసే పనులను వేగవంతం చేయాలన్నారు. పీఎం సూర్య ఘర్ పథకంపై జిల్లా స్థాయిలో సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించి, ఈ పథకంపై వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సంస్థ పరిధిలో పెండింగ్‌లో ఉన్న వర్క్ ఆర్డర్లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. విద్యుత్ శాఖ ఏఈఈలు సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరదల కారణంగా ఎదురయ్యే విపత్తులను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో వినియోగదారుల సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకు వీలుగా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలన్నారు. విద్యుత్ వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్లు 1912, 1800 425 155333కు కాల్ చేసి సమస్య పరిష్కారించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ టెక్నికల్, హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ కె.గురవయ్య, ప్రాజెక్ట్స్ అండ్ ఐటీ డైరెక్టర్ పి.ఆయూబ్‌ఖాన్, చీఫ్ జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) పి. సురేంద్రనాయుడు, సీఎస్సీ జనరల్ మేనేజర్ చక్రపాణితోపాటు 9 జిల్లాల నుంచి సూపరింటెండింగ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.