
తండ్రిని పరామర్శిస్తే తప్పా?
తిరుపతి రూరల్ : ‘‘ఆరోగ్యం సరిగా లేక వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన తండ్రిని ఆయన కొడుకు పరామర్శిస్తే తప్పా..? అందరి సమక్షంలో కేవలం 15 నిముషాలు మాట్లాడితే నేరమా..? రాజ్యాంగంలో అలా ఎక్కడైనా రాసి ఉందా? ఇప్పటికే చేయని తప్పుకు 130 రోజులుగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి జైలులో ఉన్నారు.. ఆయన బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిసి ఈనెల 24వ తేదీన తీర్పు ఇవ్వనున్నారు. ఈ సమయంలో ఆయనకు బెయిల్ రానీయకుండా చేయడానికి ఓ దిన పత్రిక (సాక్షి కాదు)లో అసత్య వార్తలు రాయడం, కోర్టులను ప్రభావింతం చేసేలా కథనాలు వండి వార్చడం అనైతికం’’ అంటూ తిరుపతి రూరల్ ఎంపీపీ మూలం చంద్రమోహన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ మద్యం కేసులో నిందితుడైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీం కోర్టు ఇచ్చిన ముందస్తు బెయి లులో సహ నిందితులను కలవకూడదు అని ఎక్కడా చెప్పలేదన్నారు. అది కూడా తన తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆరోగ్యం బాగాలేక విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మోహిత్ రెడ్డి వెళ్లి పలకరించడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. చెవిరెడ్డి ధర్మబద్ధంగా వచ్చే బెయిల్‌ను అడ్డుకోవడానికి ఇంత అనైతికంగా ప్రభుత్వానికి అనుకూలమైన ఓ పత్రికలో వార్తలు రాయడాన్ని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. అలా రాసిన వారి విచక్షణకు వదిలేస్తున్నామని, దీనికి కాలమే సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు.