
పెళ్లి కాలేదని యువకుడి ఆత్మహత్య
● గరుడ వారధిపై నుంచి కిందకు దూకిన తమిళనాడు వాసి
తిరుపతి క్రైమ్ : ెపళ్లి కాలేదని మనస్తాపంతో తమిళనాడుకు చెందిన ఓ యువకుడు బుధవారం తిరుపతిలోని గరుడ వారధిపై కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. మధురైకి చెందిన పాండ్యరాజన్(31) వివాహం కాలేదని కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం కుటుంబీకులతో కలిసి తిరుమలకు వచ్చాడు. శ్రీవారి దర్శనానంతరం కుటుంబసభ్యులను మధురై వెళ్లేందుకు రైలు ఎక్కించాడు. తాను బస్సులో వస్తానని వారికి చెప్పి బుధవారం ఉదయం మున్సిపల్ పార్క్ సమీపంలో గరుడ వారధి పైనుంచి కిందకు దూకేశాడు. తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి సెల్‌ఫోన్ ఆధారంగా కుటుంబీకులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్వీ మెడికల్ కాలేజీకి తరలించినట్లు అలిపిరి ఎస్‌ఐ లోకేష్‌కుమార్ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిమృతి
కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలోని హెచ్‌ఏఎల్ పరిధిలో తిరుపతికి చెందిన బీటెక్ విద్యార్థి పవన్ (20) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నిర్వాహుకులు తెలిపిన వివరాల మేరకు.. పవన్ ఓ ఇంజినీరింగ్ కాలేజీలో రెండో ఏడాది చదువుతూ ఓ పీజీ హాస్టల్‌లో ఉంటున్నాడు. హాస్టల్ గదిలో బొద్దింకల నివారణకు పురుగుల మందును సిబ్బంది పిచికారీ చేశారు. ఆ విషయం తెలియని పవన్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. తెలియకుండానే పురుగుల మందును పీల్చడంతో కొంతసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో గదిలో ఎవరూ లేరు. కొంతసేపటికి మందు ప్రభావంతో యువకుడు మరణించాడు. హాస్టల్ నిర్వాహకుల సమాచారం మేరకు స్థానిక పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే దీనిపై తోటి విద్యార్థులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.