
కొనసాగుతున్న గజ బీభత్సం
నాశనమైన వరి పంట
చంద్రగిరి : మండలంలోని ఏ.రంగంపేట అటవీ ప్రాంత సమీపంలో ఉన్న పంట పొలాలపై మూడు రోజులుగా గజరాజులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో రైతులు, గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. బుధవారం వేకువజామున కందులవారిపల్లె, కూచువారిపల్లె పంట పొలాలపై ఏనుగులు విరుచుకుపడ్డాయి. వరి, అరటి, కొబ్బరి చెట్లు, గ్రాస్ గడ్డిని ధ్వంసం చేశాయి. పొలానికి వేసి ఉన్న ఫెన్సింగ్, నీటి సరఫరాకు అమర్చిన పైపులను కూడా నాశనం చేశాయి. ఏనుగులు పంటల పొలాలను ధ్వంసం చేస్తుండటంతో గ్రామస్తులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగులు గుంపును దారి మళ్లించారు. బుధవారం రాత్రి కూడా చిన్నరామాపురం, కందులవారిపల్లె, భీమవరం ప్రాంతాలలో గజరాజులు సంచరించే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

కొనసాగుతున్న గజ బీభత్సం