తిరుపతి అన్నమయ్య సర్కిల్ : చైన్నె ప్యాసింజర్ రైలు ప్రయాణం గందరగోళంగా మారింది. సాధారణంగా ఈ రైలు తిరుపతి నుంచి నడుస్తోంది. బుధవారం నుంచి తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ముందుగా ప్రకటించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తిరుపతిలో బుధవారం మధ్యాహ్నం 1.45 గంటలకు ఈ రైలు కోసం వందల మంది ప్రయాణికులు, విద్యార్థులు తిరుపతి రైల్వే స్టేషన్‌లో వేచి ఉన్నారు. అధికారులు ఉన్నఫళంగా రైలును తిరుచానూరు స్టేషన్ నుంచి నడపాలని నిర్ణయించారు. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ లేకుండా నడిచే ప్యాసింజర్ రైలు కావడంతో ఎక్కువ మంది సామాన్యులే ఉంటారని, రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని నిలదీశారు.
ఖాళీగా వెళ్లిన రైలు
తిరుచానూరు స్టేషన్ నుంచి బయలుదేరిన చైన్నై ప్యాసింజర్ రైలు ప్రయాణికులు లేక ఖాళీగా వెళ్లింది. చైన్నె నగరంతోపాటు అక్కడి ప్రాంతాలకు చెందిన భక్తులు ఎక్కువగా చైన్నె ప్యాసింజర్ రైలులో తిరుపతి చేరుకుని తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుంటారు. అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా రైలును మార్చడం సరైన పద్ధతి కాదని ప్రయాణికులు, శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.