
అనుక్షణం.. అప్రమత్తం
తిరుపతి క్రైమ్ : జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎడతెరపి లేని వానలకు రోడ్లు నీటి మడుగులను తలపిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. నీటి ప్రవాహం అధికంగా ఉండే ప్రాంతాల్లో పోలీసు గస్తీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వర్షాలు తగ్గేవరకు సెలవులపై ఎవరూ వెళ్లకుండా సేవలందించేందుకు తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం పెళ్లకూరు మండలంలోని కలవకూరు వద్ద స్వర్ణముఖీ నది చెక్‌డ్యామ్‌ను ఎస్పీ సుబ్బరాయుడు పరిశీలించారు. వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. నదులు, కాలువలను ఎవరూ దాటకుండా రోడ్డుపై ముళ్ల కంచెలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తాము అందుబాటులో ఉంటామని, ఎవరైనా నేరుగా కూడా తనను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. అలాగే ప్రజలు సైతం తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆయన మాటల్లోనే..