
రైతు సభను అపహాస్యం చేయడం విడ్డూరం
తిరుపతి కల్చరల్ : రైతుల గోడుపై పూతలపట్టులో ఆక్రందన సభ పెట్టుకుంటే దానిని పూతలపట్టు ఎమ్మెల్యే ఆపహాస్యం చేయడం దుర్మార్గమని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ జాగీరు కాదని రైతు సంఘాల నేతలు పి.హేమలత, టి.జనార్దన్, సీపీఐ రాష్ట్ర నేత రామానాయుడు ఎమ్మెల్యేకు ఘాటైన సమాధానం చెప్పారు. శుక్రవారం సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నీ ప్రతాపం మామిడి రైతులపై కాదు, ఫ్యాక్టరీలపై చూపించాలని హితవు పలికారు. మామిడి రైతుకు రూ.8 , సబ్సిడీ రూ.4 కలిపి మొత్తం సొమ్ములు రైతులకు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం రూ.4 సబ్సిడీ మాత్రమే చెల్లించిందన్నారు. అది కూడా ఆక్రందన సభకు ముందు రోజు విడుదల చేయడం అంటే అది రైతు సంఘం విజయమని తెలిపారు. బంగారు పాళ్యంలో రైతు సభను జరగనీయకుండా ఎమ్మెల్యే అధికారులతో, ప్రవేటు వ్యక్తులతో భయపెట్టి సభ అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.40 ఫ్యాక్టరీలను నియంత్రించలేక 40 వేల మంది రైతులకు అన్యాయం చేయడం మీకు తగదన్నారు. మామిడి రైతులకు సమాధానం చెప్పలేక ఎదురుదాడికి పూనుకోవడం బాధాకరమన్నారు. బెదిరింపులతో మామిడి రైతుల ఉద్యమాన్ని అడ్డుకోలేరని హితవు పలికారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన రూ.370 కోట్ల బకాయిలను తక్షణం ఇప్పించకపోతే జరగబోయే ఉద్యమాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.