
విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు తాత్కాలిక బ్రేక్
తిరుపతి రూరల్ : ఏపీలో విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. యాజమాన్యాలతో మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు విఫలం కావడంతో బుధవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లాల్సి ఉంది. ఆ మేరకు ఇప్పటికే సమ్మె నోటీసును కూడా ప్రభుత్వానికి అందించారు. కొన్ని అంశాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతులు కావాల్సి ఉంది. ఆయన ప్రధాని పర్యటన ఏర్పాట్లలో బిజీగా ఉన్నారని, చీఫ్ సెక్రటరీతో ఈనెల 17వ తేదీన మరోసారి చర్చించిన తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని యాజమాన్యాలు సూచించాయి. దీంతో సమ్మెను రెండు రోజులపాటు వాయిదా వేసేందుకు జేఏసీ నేతలు అంగీకరించారు. అయితే చీఫ్ సెక్రటరీ సమక్షంలో జరిగే చర్చలు విఫలమైతే నిరవధిక సమ్మెలోకి వెళతామని స్పష్టం చేశారు.
ఇద్దరు హెచ్‌ఎంలకు షోకాజ్ నోటీసులు
రేణిగుంట:మండలంలోని ఆర్.మల్లవరం జెడ్పీ హైస్కూల్, ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు డీఈఓ కేవీఎన్ కుమార్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరాలు.. బుధవారం ఆయా పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఎఫ్‌ఏ పరీక్షలను డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకంలో లోపాలను గుర్తించారు. కలర్ కోడింగ్ లేకపోవడంతోపాటు తగు పరిమాణంలో లేని కోడిగుడ్లను పిల్లలకు వడ్డించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వంట గదులు, స్టోర్ రూమ్‌లు పరిశుభ్రంగా లేకపోవడంపై మండిపడ్డారు. విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడితే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇద్దరు ప్రధానోపాధ్యాయులతోపాటు కోడిగుడ్లు సరఫరా చేసిన సన్‌రైజ్ ఆగ్రో ఫామ్స్ సంస్థకు సైతం నోటీసులు జారీ చేశారు.
వ్యవసాయంలో
సాంకేతికత అవసరం
రేణిగుంట : వ్యవసాయంలో నూతన సాంకేతికతను పాటిస్తే ఆశించిన దిగుబడి సాధించవచ్చని ఎస్వీ వెటర్నరీ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ జేవీ రమణ తెలిపారు. రేణిగుంట మండలం కరకంబాడి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం వారు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ), చిత్తూరు వారి సహకారంతో బుధవారం కిసాన్ మేళా నిర్వహించారు. రమణ మాట్లాడుతూ వ్యవసాయంతో పాడి పరిశ్రమ కూడా రైతులు చేపడితే అధిక ఆదాయం పొందవచ్చని వెల్లడించారు. శోభా మణి, సుమతి, రూత్, శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయాధికారి ప్రసాదరావు, చిత్తూరు జిల్లా ఉద్యానశాఖాధికారి దశరథ రామిరెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు.

విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు తాత్కాలిక బ్రేక్