
పాఠశాలలో మందుబాబుల వికృత చేష్టలు
కేవీబీపురం: తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలోని కళత్తూరులోని ప్రాథమిక పాఠశాలలో మద్యం బాబులు వికృత చేష్టలకు దిగారు. రాత్రిళ్లు మద్యం సేవించి, పేకాట ఆడేందుకు, వ్యక్తిగత, అసాంఘిక కార్యకలాపాల కోసం పాఠశాలను వినియోగించుకోవడం అలవాటు చేసుకున్నారు. మంగళవారం రాత్రి బడికి వేసిన తాళాలను పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. అర్ధ రాత్రిలో బడిలోని పలు రికార్డులను చించేశారు. అక్కడే చిందరవందరగా పడేశారు. మద్యం సేవించిన వారు ఆ వ్యర్థాలను అక్కడే వదిలి వెళ్లారు. సాపా, దిండు అక్కడే పడేశారు. దీనిపై స్థానిక నేత ద్వారా పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. ఎస్‌ఐ నరేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ గతంలో కూడా ఇదే విధంగా తాళాలు పగలగొట్టి ,పాఠశాలలోకి చొరబడి నానా హంగామా చేశారని వాపోయారు. ఇప్పటికై నా స్పందించి పోలీసులు నిఘా పెట్టాలని కోరారు. ఎస్‌ఐ నరేష్ మాట్లాడుతూ పూర్తిగా నిఘా ఉంచుతామని, దొరికిన రోజు మందు బాబుల మత్తు దించడమే కాకుండా, కటకటాల్లోకి నెడుతామని హెచ్చరించారు.