
ఫీజు చెల్లింపులు.. తప్పని పడిగాపులు
తిరుపతి సిటీ : ఆధునిక టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రధానంగా డిజిటల్ పేమెంట్ సిస్టమ్ రాజ్యమేలుతోంది. చివరకు తోపుడు బండ్ల వ్యాపారులు సైతం ఆన్‌లైన్ చెల్లింపులను అందిపుచ్చుకున్నారు. అయితే డిజిటల్ టెక్నాలజీ, ఏఐ, డేటా సైన్స్, కోడింగ్, సైబర్ సెక్యూరిటీ అంటూ ఆధునిక కోర్సులను బోధించే ఎస్వీయూనివర్సిటీలో మాత్రం ఫీజుల చెల్లింపులకు డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అందుబాటులో లేకపోవడంపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఫీజు కట్టాలంటే వర్సిటీలోని యూనియన్ బ్యాంకులో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోతున్నారు.
గంటల తరబడి నిరీక్షణ
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఏళ్ల క్రితమే డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. ఎస్వీయూలో మాత్రం కళాశాల, హాస్టల్ ఫీజులు చెల్లించాలంటే విద్యార్థులు బ్యాంకులను ఆశ్రయించాల్సి వస్తోంది. వర్సిటీలోని యూనియన్ బ్యాంక్‌లో ఒకే క్యాషియర్ ఉండటంతో సాధారణ కస్టమర్లతో పాటు విద్యార్థులు వందల సంఖ్యలో సేవల కోసం ఎదురు చూస్తుంటారు.దీంతో ఫీజులు చెల్లించాలంటే గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిందే. ఈ క్రమంలోనే ఫీజు చెల్లింపులకు ఒక రోజు కళాశాలకు సెలవు పెట్టాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీసీ చొరవ చూపాలి
ఎస్వీయూలో డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ను తక్షణం అమలులోకి తీసుకురావాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. బ్యాంకులో సిబ్బంది కొరతతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. వీసీ నర్సింగరావు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు.