
బ్యాంక్‌లో చోరీకి యత్నం
నాగలాపురం: నాగలాపురంలోని యూనియన్ బ్యాంకులో మంగళవారం రాత్రి ఇద్దరు దుండగులు చోరీకి యత్నించారు. బుధవారం ఉదయం బ్యాంకు అధికారులు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. పుత్తూరు రోడ్డులోని బ్యాంకు పక్కనే సిమెంట్ గోడౌన్ షట్టర్‌ను పగులగొట్టి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. తర్వాత గోడౌన్ నుంచి బ్యాంకు గోడకు కన్నం వేసి చొరబడ్డారు. ముందుగా అలారం, సీసీ కెమెరాలను పనిచేయకుండా చేశారు. అనంతరం లాకర్ గదిలోకి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. అది తెరుచుకోకపోవడంతో వెనుదిరిగారు. ఈ క్రమంలో బ్యాంకులోని సీసీటీవీ డీవీఆర్ బాక్సులు, హార్డ్ డిస్క్‌లను తీసుకెళ్లారు. డీఎస్పీ రవికుమార్, ఎస్‌ఐ రామస్వామి, ట్రైనింగ్ ఎస్‌ఐ ప్రసాద్ ఘటనాస్థలం పరిశీలించారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది. సీసీ ఫుటేజీ ద్వారా ఇద్దరు వ్యక్తులు చోరీకి యత్నించినట్లు పోలీసులు గుర్తించారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 72,473 మంది స్వామివారిని దర్శించుకోగా 23,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.35 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.