
నిబంధనల మేరకే బాణసంచా విక్రయం
తిరుపతి రూరల్ : నిబంధనల మేరకే బాణసంచా విక్రయాలు సాగించాలని, అనుమతి లేకుండా అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తిరుపతి ఆర్‌డీఓ రామ్మోహన్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తహసీల్దార్లు, బాణసంచా వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఆర్‌డీఓ మాట్లాడుతూ భారీ శబ్దాలు వచ్చే టపాకాయలపై నిషేధం ఉందని వెల్లడించారు. ఇళ్లు, జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయకూడదని తెలిపారు. పన్నులను సక్రమంగా చెల్లించాలని కోరారు. ఈ క్రమంలోనే బాణసంచా దుకాణాలను తహసీల్దార్లు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆయా షాపుల వద్ద అగ్నిప్రమాద నివారణ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు.
తిరుపతి నగరంలో..
తిరుపతి నగరంలో తుడా కార్యాలయం వద్ద ఇందిరామైదానం, ఇస్కాన్ ఆలయం సమీపంలోని మైదానం, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, తారకరామా స్టేడియంలో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్‌డీఓ ఆదేశించారు.