
మనమూ ‘స్పేస్’ తీసుకుందాం
● అంతరిక్ష వారోత్సవాల ముగింపు వేడుకల్లో ఎయిర్ కమాండర్ రాజేష్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ స్పేస్‌లో బలీయమైన శక్తిగా ఎదగాలంటే యువ శాస్త్రవేత్తలు తయారు కావాల్సిన అవసరం ఉందని ఇనిస్టిట్యూట్ ఆప్ ఏరోస్పేస్ మెడిసిన్ అండ్ కమాండర్ రాజేష్‌కుమార్ విద్యార్థులకు సూచించారు. షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ అధ్యక్షతన బ్రహ్మప్రకాష్ హాలులో సోమవారం ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ ఎండ్ కమాండర్ రాజేష్‌కుమార్ ముఖ్య అథితిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాట్లాడుతూ యువతరం సాఫ్ట్‌వేర్‌వైపు చూస్తున్నారని, ఇస్రోలో చేరితే ఉద్యోగంతో పాటు దేశానికి సేవలు అందించే అవకాశం దక్కుతుందని వివరించారు. భారత అంతరిక్ష కార్యక్రమాలకు డాక్టర్ హోమీజే బాబా బీజం వేస్తే డాక్టర్ విక్రమ్ సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్ ధవన్, ఏపీజే అబ్దుల్‌కలాం, డాక్టర్ కస్తూరి రంగరాజన్ లాంటి ఎంతోమంది శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష కార్యక్రమాలను ప్రపంచం అబ్బురపడేలా ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. సుమారు మూడు రాష్ట్రాల్లోని తొమ్మిదో ప్రాంతాల్లో అంతరిక్ష కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం శుభపరిణామమని కొనియాడారు. అనంతరం ఈఎస్ పద్మకుమార్ మాట్లాడుతూ 1999 నుంచి అంతరిక్ష వారోత్సవాలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని, ఏటా అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రజలకు వివరించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో గగన్‌యాన్–1 ప్రాజెక్ట్, చంద్రయాన్–4, వీనస్ (శుక్రయాన్) వంటి ప్రయోగాలతో అంతరిక్షంలో సత్తాచాటుతామని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతితోపాటు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో షార్ కంట్రోలర్ రమేష్ కుమార్, అసోసియేట్ డైరెక్టర్ ముత్తు చైళియన్, ఎంఎస్‌ఏ డిప్యూటీ డైరెక్టర్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.