
శభాష్ పోలీసు.. !
చంద్రగిరి: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. అక్కడికి చేరుకుని అతన్ని కాపాడి శభాష్ అనిపించున్నారు. తిరుపతికి చెందిన మురళీనాయక్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా కుటుంబ కలహాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది తనువు చాలించాలని నిర్ణయించుకున్నారు. శ్రీనివాసమంగాపురం సమీపంలో రైల్వే ట్రాక్‌పైకి చేరుకున్నాడు. డయల్ 100కు ఫోన్ చేసి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన చావుకు ఎవరూ కారణం కాదని తెలిపారు. అప్రమత్తమైన కమాండ్ కంట్రోల్ అధికారులు చంద్రగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్లూకోట్స్‌లో విధుల్లో వున్న కానిస్టేబుల్ చిరంజీవి, కిరణ్, శ్రీను ఫోన్ నంబరు ఆధారంగా మురళీ నాయక్ వద్దకు చేరుకున్నారు. అతనికి నచ్చజెప్పి క్షేమంగా తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కౌన్సిలింగ్ అనంతరం ఇంటికి పంపించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు.