
సీఎంఆర్ కర్మాగారంలో అగ్నిప్రమాదం
ఏర్పేడు : మండలంలోని చింతలపాళెం టోల్‌గేట్ సమీపంలోని సీఎంఆర్ ఎకో అలైవీల్ తయారీ పరిశ్రమలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా మంటలు దట్టమైన పొగతో వ్యాపించటంతో ఫ్యాక్టరీలో పని చేస్తున్న సుమారు 200 మంది కార్మికులు, సిబ్బంది భయంతో రోడ్డుపైకి పరుగులు తీశారు. 8 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురి కావడంతో వారిని చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు. చింతలపాళెం టోల్‌గేట్ సమీపంలోని ద్విచక్ర వాహనాలు, 4 వీలర్స్ వాహనాల అలై వీల్స్‌ను తయారు చేస్తారు. శుక్రవారం సాయంత్రం కర్మాగారం పై భాగంలో ఓ పైపు గుండా వెళ్లే ఆయిల్ లీక్ కావడంతో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు వ్యాపించాయి. నిమిషాల వ్యవధిలో దట్టమైన పొగతో కూడిన మంటలు ఎగసిపడటంతో ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు, సిబ్బంది భయాందోళనతో రోడ్డు మీదకు పరుగులు తీశారు. మంటలు ఫ్యాక్టరీ లోపలకు వ్యాపించకుండా పైకి ఎగసిపడటంతో కర్మాగారం లోపల ఉన్న కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. మంటలు లోపలకు వ్యాపించి ఉంటే ఊహకందని విపత్తు జరిగి ఉండేది. ప్రమాద విషయం తెలుసుకున్న జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య ప్రమాద స్థలానికి చేరుకున్నారు. శ్రీకాళహస్తి, వెంకటగిరి, తిరుపతి నుంచి మూడు అగ్నిమాపక వాహనాలను తీసుకొచ్చి మంటలను అదుపు చేశారు. ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికులు ఎనిమిది మందికి శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తి అస్వస్థతకు గురై కళ్లు తిరిగి పడిపోయారు. అస్వస్థతకు గురైన వారిలో శాంతి, మధుప్రియ, గురవమ్మ, వెంకటమ్మ, ప్రియ తదితరులు ఉన్నారు. వారిలో ఆరుగురిని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒక యువతిని మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరిని రేణిగుంట సమీపంలోని బాలాజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్, శ్రీకాళహస్తి ఆర్‌డీవో భానుప్రకాష్‌రెడ్డి, ఏర్పేడు తహసీల్దార్ ఎం.భార్గవి, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, ఏర్పేడు సీఐ శ్రీకాంత్‌రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు.

సీఎంఆర్ కర్మాగారంలో అగ్నిప్రమాదం