
శ్రీవారి బ్రహ్మోత్సవాల స్ఫూర్తితో పనిచేద్దాం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల విజయ స్ఫూర్తితో పనిచేసి తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వేడుకలను జయప్రదం చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పిలుపు నిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల అనంతరం శుక్రవారం తిరుపతి మహాతి ఆడిటోరియంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాలక మండలి సభ్యులు, జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీస్ విభాగం, టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయం, శ్రీవారి సేవకుల సేవలు, భక్తులు, మీడియా సమష్టి సహకారంతో విజయవంతం చేయగలిగామన్నారు. అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు ప్రణాళికాబద్ధంగా సౌకర్యాలు కల్పించేలా మూడు నెలల ముందు నుంచే మార్గదర్శిని రూపొందించామన్నారు. జేఈవో వీరబ్రహ్మం మాట్లాడుతూ.. ప్రతి రోజూ అధికారులతో సమీక్షించుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరూ ఒక టీం వర్క్ గా పని చేశారన్నారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ.. భక్తుల రద్దీని నియంత్రించేందుకు క్యూలైన్లు ఏర్పాటు, టీటీడీ, విజిలెనన్స్ , పోలీసులు సమన్వయంతో పనిచేశారన్నారు. ిసీవీఎస్వో మురళీకృష్ణ మాట్లాడుతూ.. ఈ ఏడాది అదనంగా 40 వేల మంది భక్తులు వచ్చినా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీటీడీ, పోలీసు అధికారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.