
ఎస్వీయూలో కాగ్ నివేదికపై సమీక్ష
తిరుపతి సిటీ : ఎస్వీయూలో కాగ్ నివేదికపై ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమీక్షించింది. బుధవారం వర్సిటీ పరిపాలనా భవనంలోని సెనేట్ హాల్‌లో ఎస్వీయూ అధికారులతో అకౌంట్స్ కమిటీ సమావేశమైంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడు పి.రామాంజనేయులు ఆధ్వర్యంలో వర్సిటీలోని పరిణామాలపై పూర్తి స్థాయిలో చర్చించింది. ప్రధానంగా మొత్తం 24 అంశాలతో కూడిన నివేదికను విశ్లేషించింది. ఉద్యోగ, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిని మెరుగు పరిచే ఉద్యోగ మేళాలు, నూతన విద్యా విధానం–2020 అమలు, కొత్త యూజీ కోర్సుల్లో ప్రవేశానికి అవకాశాలు కల్పించడం, విద్యార్థుల ఫీల్డ్ ప్రాజెక్టులపై దృష్టి, నాణ్యమైన బోధనా సిబ్బంది నియామకంపై ఆరా తీసింది. విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల్లో మౌలిక సదుపాయాల, పరీక్ష ఫలితాల జాప్యం, అనుబంధ కళాశాలల్లో ఐక్యూఏసీ , ఆట స్థలాలు, ప్రయోగశాలల ఏర్పాటు, వర్సిటీకి వచ్చిన నిధుల వినియోగం, రూసా 2.0 ప్రకారం మౌలిక వసతుల కల్పనలో ప్రగతి వంటి విషయాలను సుదీర్ఘంగా చర్చించింది. ఈసందర్భంగా వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు వర్సిటీలో చేపట్టిన అభివృద్ధి పనులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు ఆనందబాబు, రాధాకృష్ణ, అశోక్ కుమార్ రెడ్డి, జయనాగేశ్వర రెడ్డి, లలిత కుమారి, శ్రీరామ్ రాజగోపాల్, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.