
ఆక్రమించి.. బోరు వేసి..!
తొట్టంబేడు : స్థానిక ఎంజీఎం ఆస్పత్రి సమీపంలో రిలయన్స్ పెట్రోల్‌బంకు వెనుక వైపు సర్వే నంబరు 152లో 1.22ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఆ భూమిని జేసీబీతో చదును చేయడం, అందులో బోరు వేయిస్తున్న దృశ్యాలు మంగళవారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై తొట్టంబేడు తహసీల్దారు భారతి మాట్లాడుతూ ఆక్రమిత భూమిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. అత్యంత ఖరీదైన ఈ భూమిని కబ్జాకోరల్లో నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
10న రెండో విడత సీట్ల కేటాయింపు
తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో రెండవ విడత అడ్మిషన్ల వెబ్ ఆప్షన్ల మార్పులకు సంబంధించిన ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. దీంతో ఉన్నత విద్యామండలి ఓఏఎండీసీ ద్వారా రెండవ విడతలో సీట్లు సాధించిన విద్యార్థులకు 10వ తేదీన సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు సాధించిన విద్యార్థులకు వారి మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు పంపనున్నారు. ఆయా కళాశాలల్లో ఈ నెల 11 నుంచి 13వ తేదీలోపు ఒరిజినల్ ధృవపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
నేటి నుంచి జాతీయ స్థాయి వర్క్‌షాప్
తిరుపతి అర్బన్ : తిరుపతిలోని తాజ్‌హోటల్‌లో బుధవారం నుంచి రెండు రోజులపాటు జాతీయ సహకార మంత్రిత్వశాఖ వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సహకారం రంగం బలోపేతం, వివిధ పథకాల అమలుపై సమీక్షించేందుకు త్రైమాసిక సమావేశం జరుగుతుందని వెల్లడించారు. జాతీయ సహకార మంత్రిత్వశాఖ సెక్రటరీ ఆశిష్ కుమార్ భుటానీ, ఏపీ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, జాయింట్ సెక్రటరీ సిద్ధార్థ్ జైన్ పాల్గొననున్నట్లు వివరించారు.