
నారావారి నకిలీ సారా!
విచ్చలవిడిగా నకిలీ మద్యం
తయారుచేస్తున్న కూటమి నేతలు
రాష్ట్రమంతా బెల్టు షాపులకు, మద్యం దుకాణాలకు సరఫరా
ఆ ఒక్క హామీని నెరవేర్చిన
చంద్రబాబు నాయుడు
జిల్లాకు ఓ మెడికల్ కాలేజి కావాలని జగన్ అన్నారు
జిల్లాకో నకిలీ మద్యం కేంద్రం
తెస్తామంటున్న చంద్రబాబు
వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర నేత చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి ధ్వజం
తిరుపతి కల్చరల్: ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీల్లో తక్కువ ధరకు మద్యం అనే హామీని మాత్రం చంద్రబాబు నెరవేర్చారని వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి వ్యంగ్యాస్త్రం సంధించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో నకిలీ మద్యం, బెల్టు షాపులకు అవకా శం లేకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపిందన్నారు. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తక్కువ ధరకు మద్యం సరఫరా చేస్తామంటూ విచ్చిలవిడిగా కూటమి నేతలు నకిలీ మద్యం తయారీ కేంద్రాలు నెలకొల్పారన్నారు. కొన్ని నెలల క్రితం తిరుపతి దామినేడు వద్ద నకిలీ మద్యం తయారీ ముఠా బయటపడితే, మొన్న అన్నమయ్య జిల్లాలో టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి తయారుచేయిస్తున్న నకిలీ మద్యం కేంద్రం ములకల చెరువులో వెలుగుచూసిందన్నారు. తాజాగా నిన్న ఇబ్రహీంపట్నంలో మరో కేంద్రం బయటపడిందన్నారు.
బెల్టు షాపులకు, మద్యం దుకాణాలకు సరఫరా
గతంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను ప్రయివేటు పరం చేసి నేడు కూటమి నేతలు తయారుచేసిన నకిలీ మద్యాన్ని బెల్టు షాపులకు, వైన్‌షాపులకు రాష్ట్రమంతా సరఫరా చేస్తున్నారని మధుసూదన్ రెడ్డి విమర్శించారు. అసలు మద్యం వ్యాపారాన్ని ప్రయివేటు పరంచేసిందే నారావారి నకిలీ మద్యం సరఫరా కోసమే అని ఆరోపించారు. ఇంత జరిగినా ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గానీ, హోంమంత్రి అనిత గానీ కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వంలో జగన్‌మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన హోంమంత్రి నేడు నారావారి నకిలీ మద్యంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించారు.
‘పచ్చ’ పత్రికలో నీచమైన రాతలు
నకిలీ మద్యం సూత్రధారి, టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి కోవర్టని పచ్చ పత్రికలో రాయడం విడ్డూరమని చిందేపల్లి మండిపడ్డారు. నకిలీ మద్యం తయారుచేస్తూ అడ్డంగా దొరికిన తర్వాత పెద్దిరెడ్డి అనుచరుడు అంటూ నీచమైన రాతలు రాయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
యువగళం హామీ ఏమైంది?
రాష్ట్రంలోని 13 లక్షల మంది ఆటో కార్మికులకు, టిప్పర్ డ్రైవర్లు, హెవీ లైసెన్స్ కలిగిన వారికి సైతం రూ.15 వేలు రూపాయలు ఇస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ బాహాటంగా ప్రకటించారని గుర్తుచేశారు. నేడు గత ప్రభుత్వం అమలు చేసిన వాహన మిత్ర పేరు మార్చి ఆటో డైవర్ల సేవలో పథకం ద్వారా వారికి నగదు బదిలీ పూర్తిస్థాయిలో అమలుచేయక మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో నేడు బహిర్గతమైన కల్తీ మద్యంపై సీఎం చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జిల్లాకో మెడికల్ కాలేజీ జగన్ సంకల్పం
– జిల్లాకో నకిలీ మద్యం తయారీ కేంద్రమే బాబు లక్ష్యం
గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జిల్లాకో మెడికల్ కాలేజీ కట్టించి అనుబంధంగా ఓ ఆస్పత్రి నెలకొల్పాలని సంకల్పించారని చిందేపల్లి చెప్పారు. అయితే నేడు చంద్రబాబు మాత్రం ప్రతి జిల్లాకు ఓ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటుచేసి రాష్ట్రంతా సరఫరా చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారని అన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలను తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కార్పొరేట్లకు పీపీపీ పద్ధతిలో కట్టబెట్డడం దుర్మార్గమన్నారు.
సీజేఐపై దాడికి యత్నంపై ఖండన
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై న్యాయవాది దాడికి ప్రయత్నించడాన్ని వైఎస్‌ఆర్‌సీపీ ఖండిస్తోందన్నారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు గోపాల్‌రెడ్డి, వెంకటాచలపతి పాల్గొన్నారు.