
మాపై ఎందుకీ నిర్దయ..!
ఎన్నిరోజులని తిరుగుతాం.. దయచూపి సమస్యలు పరిష్కరించండి కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌లో అధికారులకు చేతులు జోడించి వేడుకుంటున్న అర్జీదారులు స్ట్రెచర్‌పై వచ్చి పింఛన్ ఇవ్వాలని వేడుకున్న ఓ దివ్యాంగుడు మారని అధికారుల తీరు కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు 276 అర్జీలు
తిరుపతి అర్బన్: ‘‘రెండు చేతులు జోడించి మీకు నమస్కరిస్తున్నాం అయ్యా.. మా సమస్యకు పరిష్కారం చూపండి’’ అంటూ పలువురు ప్రజలు అధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు అధికారుల వద్దకు వెళ్లి తమ గోడు చెప్పుకుని పరిష్కారం చూపాలంటూ కంటతడి పెట్టుకున్నారు. అధికారులను ప్రాధేయపడ్డారు. తమ సమస్యలను సీరియస్‌గా తీసుకుని పరిష్కారం చూపాలంటూ కొందరు పదేపదే విజ్ఞప్తి చేశారు.
అధికారుల తీరేమో ఇలా..
అధికారులు మాత్రం ఎప్పటిలాగానే ఒకేవిధంగా మాట్లాడుతున్నారు. ప్రతి అర్జీని నిశితంగా పరిశీలన చేయండి.. సమస్యలకు పరిష్కారం చూపండి.. సమ స్య పరిష్కారం కాకుంటే అందుకు గల కారణాలను వివరించండి.. కలెక్టరేట్‌కు పదేపదే తిప్పకండి అంటూ చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు. సోమవారం కలెక్టరేట్‌కు 276 అర్జీలు వచ్చాయి. అందులో రెవెన్యూ సమస్యలే 157 అర్జీలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్‌తోపాటు పలువురు జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
కరుణించండీ సామీ..
ఏడుకొండల స్వామి కరుణించూ అంటూ పింఛన్ కోసం ఓ దివ్యాంగుడు కలెక్టరేట్‌కు సోమవారం స్ట్రెచర్‌పై వచ్చాడు. పింఛన్ ఇవ్వాలంటూ జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వికలాంగుడి తల్లి రేణుక మాట్లాడుతూ నారాయణవనం మండలం సుబ్బానాయుడు కండ్రిగకు చెందిన తమ కుమారుడు లక్ష్మయ్య(25)భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితం అయ్యాడని వాపోయింది. పేద కుటంబం కావడంతో బతుకు భారంగా మారిందని..పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని ఆమె జేసీ వద్ద కన్నీళ్లు పెట్టుకుంది.

మాపై ఎందుకీ నిర్దయ..!