
మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం
తిరుపతి క్రైమ్: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 24 మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. తిరుమల ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణికులతో వెళ్తున్న ఓ లోకల్ జీపు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి 24 మలుపు వద్ద పిట్టగోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అనంతరం జీపును పక్కకు తొలగించి టీటీడీ సిబ్బంది ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.
ఎర్రచందనం కేసులో
ఒకరికి జైలు
తిరుపతి లీగల్: అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం దుంగలను తరలించడానికి ప్రయత్నించిన కేసులో నారాయణవనం మండలం, ఎరికంబట్టుకు చెందిన తిరుమల సురేష్కు రెండు సంవత్సరాలు జైలు శిక్ష, 20వేల రూపాయ ల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథ నం మేరకు.. 2015 మార్చి 4వ తేదీ పిచ్చాటూరు మండలం, రెప్పలపట్టు గ్రామం సమీపంలోని అరణియారు డ్యాం వద్ద పిచ్చాటూరు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. పోలీసులను చూసి నిందితుడు సురేష్తో పాటు మరి కొంతమంది పోలీసులపై రాళ్లతో దాడిచేసి పరారయ్యారు. అయితే పోలీసులు సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరుసటి రోజు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. సురేష్‌పై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మరో ఇద్దరిపై కేసును కొట్టివేస్తూ తీర్పులో పేర్కొన్నారు.