
పులికాట్ సరస్సులో బాలుడు గల్లంతు
– ముమ్మరంగా గాలిస్తున్న జాలర్లు
తడ : పులికాట్ సరస్సులో సోమవారం తమిళనాడుకు చెందిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయి గల్లంతయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం జాలర్లు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి. ఇరకం దీవికి చెందిన ఎల్లయ్య పిల్లల చదువు నిమిత్తం తమిళనాడులోని ఎన్నూరు కుప్పానికి వెళ్లిపోయాడు. గ్రామంలో శనివారం జరిగిన తిరునాళ్ల నిమిత్తం కుమారుడు రామరాజు (17)తో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. తిరునాళ్లు ముగిసిన అనంతరం సోమవారం తిరుగు పయనమయ్యారు.
తాత ఆర్ముగం పడవలో హుషారుగా ఆడుకుంటూ బయలుదేరిన రామరాజు కొంతసేపటి తరువాత పడవలో కనిపించలేదు. తండ్రి, తాత ఇది గమమనించి చుట్టూ గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామ జాలర్లు తమ పడవల్లో పులికాట్ సరస్సులో గాలింపు చేపట్టారు. పొద్దుపోయి, చీకట్లు కమ్ముతున్నా గల్లంతైన బాలుడి ఆచూకీ లభించలేదు. గ్రామం మొత్తం పులికాట్ సరస్సు వద్దకు చేరుకుని బాలుడి ఆచూకీ కోసం సరస్సు వైపు ఆందోళనగా చూస్తున్నారు.
ఉరేసుకుని వ్యాపారి మృతి
కోట: కోట బజారువీధిలో టీదుకాణం నడుపుతున్న రాము(45) అనే వ్యక్తి సోమవారం ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. ఇతను గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈ విషయమై తమకు ఎటువంటి సమాచారం లేదని ఎస్‌ఐ పవన్‌కుమార్ తెలిపారు.