
మాటల్లోనే పారదర్శకత.. సిఫార్సులకే ప్రాధాన్యత
చిట్టమూరు: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నాలుగు నెలలక్రితం ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టింది. ఈ ప్రక్రియలో ఎక్కడా అవకతవకలకు చోటు లేకుండా పారదర్శకంగా చేపట్టామని అసెంబ్లీ సాక్షిగా విద్యాశాఖ మంత్రి చెప్పిన మాటలు క్షేత్రస్థాయిలో వచ్చేసరికి నీటి మూటలుగా మారాయి. ఉపాధ్యాయులు ఒక పాఠశాలలో పని చేసేందుకు బదిలీపై వస్తే కనీసం రెండేళ్ల పాటు అక్కడే పని చేయాలన్న నిబంధన (జీఓ) ఉంది. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం బదిలీల్లో భాగంగా నెల్లూరు నుంచి చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయిని బదిలీపై వచ్చారు. ఇక్కడ పని చేస్తే హెచ్‌ఆర్‌ఏ తక్కువగా వస్తుందని గతంలో పని చేసిన ప్రాంతంలో హెచ్‌ఆర్‌ఏ ఎక్కువగా వస్తుందనే కారణంతో భారీ స్థాయిలో ముడుపులు చెల్లించుకుని సీఎంఓ కార్యాలయం నుంచే సిఫారసు చేయించుకుని సదరు ఉపాధ్యాయిని మళ్లీ తాను పని చేస్తున్న నెల్లూరుకు బదిలీ చేయించుకున్నారు. ఇదే కొవలో మరి కొంతమంది బదిలీలు చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో ఉపాధ్యాయ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా బదిలీల ప్రక్రియను చేపడుతుండడంపై పలువురు ఉపాధ్యాయులు ఇదెక్కడి పారదర్శకత అని ప్రశ్నిస్తున్నారు.
సీపీఓగా రాజశేఖర్
తిరుపతి అర్బన్: చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్(సీపీఓ)గా రాజశేఖర్ సోమవారం కలెక్టరేట్‌లోని తమ చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈయన విజయవాడ ప్రధాన కార్యాలయం నుంచి తిరుపతి జిల్లాకు బదిలీపై విచ్చేశారు. సీపీఓ ప్రేమ్‌చంద్రారెడ్డి ఉద్యోగ విరమణ అనంతరం అసిస్టెంట్ సీపీఓగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు ఆరు నెలలుగా ఇన్‌చార్జ్ సీపీఓగా పనిచేశారు. తాజాగా సీపీఓ పోస్టును భర్తీ చేశారు. బాధ్యత లు స్వీకరించిన అనంతరం ఆయన మర్యాదపూర్వకంగా కలెక్టర్ వెంకటేశ్వర్‌ను కలిశారు.
వస్తువుల విక్రయాలకు
టెండర్లు ఆహ్వానం
తిరుపతి అర్బన్: సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో వినియోగంలో లేని వస్తువులను విక్రయించడానికి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు సోమవారం ఆ విభాగానికి చెందిన జిల్లా అధికారి విక్రమ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారు కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో ఈనెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులను అందించడానికి అవకాశం ఉందని స్పష్టం చేశారు. దరఖాస్తులను తమ కార్యాలయంలోనే ఇస్తామన్నారు. అనంతరం అదేరోజు సాయంత్రం 4 గంటలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్లు తెరుస్తామన్నారు.

మాటల్లోనే పారదర్శకత.. సిఫార్సులకే ప్రాధాన్యత