ప్రాణాపాయంలో | - | Sakshi
Sakshi News home page

ప్రాణాపాయంలో

Oct 6 2025 6:25 AM | Updated on Oct 6 2025 6:25 AM

ప్రాణ

ప్రాణాపాయంలో

రెండేళ్లలోనే ఆరుగురి మృత్యువాత

విషమ పరిస్థితుల్లో మరో ఇద్దరు

ఇప్పటికీ సమస్యకు కారణం గుర్తించలేని అధికారులు

దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్న గ్రామస్తులు

దొరవారిసత్రం మండలం పాళెంపాడు వాసులు ప్రాణాపాయంలో ఉన్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం 25 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. గత రెండేళ్లలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. వయసుతో నిమిత్తం లేకుండా రోగుల సంఖ్య పెరుగుతుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మహమ్మారి వ్యాప్తికి కారణం కనిపెట్టేందుకు అధికారులు ఇంటింటికీ వెళ్లి బ్లడ్‌ టెస్ట్‌లు చేయించారు. గ్రామంలో రక్షిత పథకం.. చేతి బోర్లలో నీటిని పరీక్షించారు. అయినప్పటికీ అసలు సమస్యను గుర్తించలేకపోయారు. భూగర్భ జలాలు కలుషితం కావడం వల్లే పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సురక్షిత తాగునీటిని అందిస్తే ఇబ్బందులను అధిగమించే అవకాశముంటుందని సూచిస్తున్నారు.

పాళెంపాడు గ్రామం

దొరవారిసత్రం : మండలంలోని ఏకొల్లు పంచాయతీ పాళెంపాడుకు కిడ్నీ వ్యాధి శాపంగా మారింది. గ్రామంలోని ప్రజలు పిట్టలా రాలిపోతున్నారు. ఈ వ్యాధి బారిన ఎలా పడుతున్నారనే విషయం అధికారులకు అంతుపట్టడంలేదు. గడిచిన రెండేళ్లలో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఐదుగురు మృతి చెందగా, ఇరవై రోజుల కింట సగిలాల వెంకటేష్‌ (35) అనే యువకుడు రెండు కిడ్నీలు ఫెయిల్యూర్‌ కావడంతో మృత్యవాత పడ్డాడు. దీంతో కిడ్నీ వ్యాధి మృతుల సంఖ్య ఆరుకు చేరింది. కిడ్నీ వ్యాధి గ్రస్తులు పెరగడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గ్రామంలో సుమారు 15 రోజులుగా వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి రక్త పరీక్షలు చేస్తున్నారు. మరో వైపు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు క్షేత్రస్థాయిలో రక్షిత పథకం నీటితోపాటు, చేతి బోర్లలోనే జలాలను పరీక్షలు చేయించారు. అయితే ఇప్పటికీ కిడ్నీ వ్యాధి విజృంభణకు కారణాలను కనిపెట్టలేకపోతున్నారు.

అంతుబట్టని కారణాలు

పాళెంపాడులో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నుంచి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల వరకు పర్యటించారు. వైద్యశిబిరం ఏర్పాటు చేసి వివిధ పరీక్షలు చేయిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికీ అసలు కారణాలు అంతుపట్టడం లేదని చెబుతున్నారు. ర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ ఎస్‌డీఎం సత్తార్‌ 12 రోజుల కిందట గ్రామంలో పర్యటించి నాలుగు చేతి బోర్లను రీఫుల్లింగ్‌ చేయించారు. రక్షిత నీటి పథకం ఓవర్‌ హెడ్‌ ట్యాంకును పూర్తిస్థాయిలో క్లోరినేషన్‌ చేయించారు. మళ్లీ గ్రామంలో నీటిని పరీక్షలకు పంపించి, నివేదికలు వచ్చిన తర్వాతే గ్రామస్తులు వాడుకునేలా చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా గ్రామానికి తాగునీరు సరఫరా చేయాలని సూచించారు.

కిడ్నీ వ్యాధితో విలవిల్లాడుతున్న 25 మంది బాధితులు

అంతటా ఆందోళన

గ్రామంలో సుమారు 170 కుటుంబాలున్నాయి. 750 నివసిస్తున్నారు. వైద్యాధికారులు లెక్కల ప్రకారం ఇప్పటి వరకు కిడ్నీ రోగులు 25 మంది ఉన్నట్లు గుర్తించారు. అందులో ప్రస్తుతం ఇద్దరు డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. వీరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారురు. పాళెంపాడులో గత కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధి వ్యాప్తి చెందుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంతో పలుమార్లు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకువచ్చినా స్పందించలేదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు ఎవరి తోచిన కారణాలను వారు వెల్లడిస్తున్నారు. చేతి బోర్లతో నీరు తాగి కిడ్నీలు దెబ్బతిన్నాయని కొందరు, స్థానికంగా వైద్యం అందించే ఆర్‌ఎంపీల మందుల వాడడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని మరికొందరు చెబుతున్నారు. ఆర్‌ఎంపీలు రాసిన పెయిన్‌ కిల్లర్‌ మందులను ఇబ్బడి ముబ్బడిగా వాడడంతో కిడ్నీ సమస్యలు తలెత్తినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మృతి చెందిన వెంకటేష్‌ కూడా ఆర్‌ఎంపీ వైద్యుడు ఇచ్చిన మందులు వేసుకోవడంతో కిడ్నీలు దెబ్బతిన్నట్లు బాధిత కుటుంబీకులు వివరిస్తున్నారు. ఏది ఏమైనా ఒకే గ్రామంలో ఇంతమంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉండడమంటే చిన్న విషయం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అసలు కారణం తెలుసుకుంటేనే సమస్యను పరిష్కరించవచ్చని వెల్లడిస్తున్నారు.

పారిశుద్ధ్యలోపమూ ఓ కారణమే..

పాళెంపాడులో కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరిగేందుకు గ్రామంలోని పారిశుద్ధ్యలోపమూ ఓ కారణమని స్థానిక వైద్యాధికారులు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి, విశాఖపట్నంలోని ల్యాబ్‌లలో ఇటీవల పాళెంపాడు గ్రామంలోని నీటి శ్యాంపిళ్లను పరీక్షించారు. ఈ సందర్భంగా భూగర్భ జలాలు కలుషితమైనట్లు తెలిసిందని అధికారులు వెల్లడిస్తున్నారు. చేతిబోర్లలో సైతం బ్యాక్టీరియా ఉందని తెలియజేస్తున్నారు.

ప్రాణాపాయంలో1
1/4

ప్రాణాపాయంలో

ప్రాణాపాయంలో2
2/4

ప్రాణాపాయంలో

ప్రాణాపాయంలో3
3/4

ప్రాణాపాయంలో

ప్రాణాపాయంలో4
4/4

ప్రాణాపాయంలో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement